రైతులకు ఇబ్బంది కలగొద్దు
నల్లగొండ : జిన్నింగ్ మిల్లుల యజమానులు రైతులకు ఇబ్బంది కలగకుండా పత్తి కొనుగోలు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం కలెక్టర్ తన చాంబర్‌లో మార్కెటింగ్, సీపీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లుల యాజమానులతో సమావేశమయ్యారు. ఎల్1, 2, 3 నిబంధన లేకుండా చూడాలని, తేమశాతంలో సడలింపు ఇవ్వాలని జిన్నింగ్ మిల్లుల యజమానులు కలెక్టర్‌ను కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పత్తి కొనుగోలు పూర్తిగా సీసీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నందున నిబంధనల సడలింపులు తన పరిధిలో లేదన్నారు. పత్తి రైతులు సరైన తేమ శాతంతో జిన్నింగ్ మిల్లులకు తీసుకువచ్చేలా ఏఈఓలు క్షేత్రస్థాయిలో పరిశీలించేలా చూడాలని వ్యవసాయ అధికారి శ్రవణ్‌కుమార్‌ను ఆదేశించారు. జిన్నింగ్ మిల్లుల యజమానుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, సమ్మెకు వెళ్లకుండా పత్తిని కొనుగోలు చేయాలని కోరారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, అడిషనల్ ఎస్పీ రమేష్, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, సీపీఐ అధికారి నింజే, జిన్నింగ్ మిల్లుల అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణారెడ్డి, శ్రీదర్‌రెడ్డి పాల్గొన్నారు.
48 గంటల్లోనే ధాన్యం డబ్బులు
జిల్లాలో ధాన్యం కొనుగోలు చేసిన రెండు రోజుల్లో రైతులకు డబ్బులు జమ చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వానాకాలంలో ఇప్పటి వరకు 72,475 మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేశామని, అందులో 46,568 మెట్రిక్ టన్నుల ధాన్యం ఓపీఎంఎస్‌లో ఎంట్రీ చేసి.. 5,657 మంది రైతులకు రూ.102 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి


