అమ్మేందుకు.. లక్కీడ్రా
ఫిర్యాదు చేస్తే నిర్వాహకులపై కేసు
స్థిరాస్తి విక్రయానికి కొత్త పంథా
సూర్యాపేటటౌన్ : ఇప్పటి వరకు వినాయక మండపాలు, దుర్గమాత మండపాల వద్ద, దసరా పండుగ వేళలో స్కూటీలు, బైక్‌లు, లడ్డూలు, చీరలు, గొర్రెపోతులంటూ లక్కీ డ్రా నిర్వహించడం చూశాం. కానీ ఇప్పుడు నయా ట్రెండ్ వచ్చింది. ఏకంగా కొందరు తమ స్థిరాస్తిని విక్రయించడానికి కొత్త పంథా ఎంచుకున్నారు. ప్లాట్లు, ఇళ్లకు సైతం లక్కీ డ్రా పేరిట రూ.500 నుంచి రూ.1000దాకా కూపన్లకు ధర నిర్ణయించి దీనిపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు ఇది హాట్‌టాపిక్‌గా మారింది.
అదృష్టం కలిసి వస్తే..
రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్లాటు, ఇళ్ల యజమానులు తమకు సంబంధించిన ప్రాపర్టీని అమ్ముకునేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కాస్త తగ్గుముఖం పట్టడం, ప్లాట్లు, ఇళ్ల కొనుగోళ్లు తక్కువగా ఉండటంతో తమ స్థిరాస్తిని ఎలాగైనా అమ్ముకునేందుకు కొత్త దందాకు తెరలేపారు. పోతే వెయ్యి.. వస్తే లక్షలు విలువ చేసే ఇల్లు అంటూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అలాగే వాట్సాప్, ఫేస్‌బుక్ గ్రూపుల్లో వైరల్ చేస్తున్నారు. ఈ లక్కీ డ్రా కూపన్‌లతో వారికి ఎక్కువ డబ్బులు వస్తాయనే ఆశతో ఈ స్కీంలు పెడుతున్నారు. రూ.వెయ్యి పెట్టి కూపన్ కొనుగోలు చేస్తే అదృష్టం కలిసి వస్తే డ్రాలో ఇల్లు గెలుపొందవచ్చనే ఆశతో ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. వ్యాపారులు, యజమానులు ఎక్కువ డబ్బులు రావాలనే ఆలోచనతో ఈ లక్కీ డ్రా స్కీం పెడుతున్నప్పటికీ చట్టబద్ధంగా ఇది ఎంత వరకు నిజమనేది ప్రజలు తెలుసుకోవాల్సి ఉంది.
కొత్త దందా
నల్లగొండ జిల్లా కేంద్రంతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, మిర్యాలగూడ, సూర్యాపేట ప్రాంతాల్లో ఈ లక్కీ స్కీంల దందా ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. సంబంధిత ప్లాట్ల వద్ద యజమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే కరపత్రాలను విరివిగా పంచిపెడుతున్నారు. చౌటుప్పల్‌లో మూడు నెలల క్రితం ఓ యజమాని లక్కీ డ్రాం స్కీం ప్రారంభించి గత ఆదివారం లక్కీ డ్రా తీశారు. ఈ డ్రాలో 3,600 మంది రూ.500 చొప్పున కొనుగోలు చేసి పాల్గొనగా ఆ యజమానికి రూ.18లక్షల ఆదాయం వచ్చినట్టు తెలిసింది. అతని ప్లాటుకు రూ.12లక్షల వరకు ధర చెప్పినా ఎవరూ కొనకపోవడంతో ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. కాగా, ప్లాటు, ఇల్లుకు సంబంధించి అన్ని అనుమతులు ఉన్నాయా.. లేవా అనేది, చట్టపరమైన సమస్యలు ఏమైనా వస్తాయనేది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరముంది.
ప్రజలు ఇలాంటి స్కీంలను నమ్మి మోసపోవద్దు. ఎవరూ కూడా ఇలాంటి స్కీంలలో పాల్గొనవద్దు. లక్కీ డ్రా స్కీంల పేరుతో ప్రజలను మోసం చేయడం చట్టరీత్యా నేరం. ఇలాంటి వాటిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తాం.
– నరసింహ, ఎస్పీ, సూర్యాపేట
ఫ పోతే వెయ్యి.. వస్తే ఇల్లు అని సోషల్ మీడియాలో ప్రచారం
ఫ చౌటుప్పల్‌లో ఇప్పటికే డ్రా తీసిన ఇంటి యజమాని
ఫ సూర్యాపేట, నల్లగొండ పట్టణాల్లో మూడు నెలల గడువుతో లక్కీడ్రా పెట్టిన ఇద్దరు యజమానులు
ఫ లక్కీడ్రాలు నేరం అంటున్న పోలీసులు


