
నేలవాలుతున్న వరిచేలు
వడ్లు మొలకెత్తుతాయని భయంగా ఉంది
ఫ అధిక వర్షంతో వాలిపోతున్న పొలాలు
ఫ నాన్‌ఆయకట్టులో కోత దశకు వచ్చిన చేలు
ఫ పొలంలోనే వర్షం నీటిలో తడుస్తున్న గింజలు
ఫ గింజలు మొలకెత్తే ప్రమాదముందని రైతుల్లో ఆందోళన
నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లాలో ఇటీవల కురుస్తున్న అధిక వర్షాల కారణంగా వేలాది ఎకరాలలో వరిచేలు నేలవాలుతున్నాయి. జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో 5,05160 ఎకరాల్లో వరిసాగైనట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. నాన్‌ఆయకట్టు ప్రాంతాలైన దేవరకొండ, నల్లగొండ, చండూరు, మునుగోడు వ్యవసాయ డివిజన్లలో జూన్, జూలై మాసాల్లో వరినాట్లు వేసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే వరిచేలు గింజలు ఎర్రబారి కోత దశకు వచ్చాయి. ఈ తరుణంలో పదిహేను రోజులుగా వరుసగా వర్షాలు కురవడంతో వేలాది ఎకరాల్లో వరిచేలు పూర్తిగా అడ్డంపడి నేలవావాలినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
వరికోత మిషన్లు వెళ్లేందుకు వీలుకాక..
చేలు నేలవారి వర్షం నీటిలో తడుస్తుండడంతో వరి గింజలు మొలకెత్తే ప్రమాదం పొంచి ఉందని రైతులు వాపోతున్నారు. వరికోతలు కోయాలంటే నీరు నిలిచి ఉండడంతో పొలాల్లోకి మిషన్లు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. నేలవాలిన వరిని కోయాలంటే చైన్ మిషన్ ద్వారా కోయించాల్సి ఉంటుంది. చైన్ మిషన్‌తో కోయించాలంటే గంటకు రూ.2,500 చెల్లించాల్సి ఉంటుందని దీంతో తాము తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎర్రబారిన వరిచేను వర్షాల కారణంగా పూర్తిగా అడ్డంపడిపోయింది. పొలంలో నీరు నిలిచిన కారణంగా వరిగింజలు మొలకెత్తుతాయని భయంగా ఉంది. కోయాలన్నా మిషన్ పొలంలోకి వెళ్లే పరిస్థితి లేదు.
– జానపాటి రాజేంద్రప్రసాద్, రైతు గుండ్లపల్లి, నల్లగొండ మండలం

నేలవాలుతున్న వరిచేలు