
ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి
నల్లగొండ : స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. మంగళవారం నల్లగొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నోడల్ అధికారులతో ఆమె సమావేశమై మాట్లాడారు. ఎన్నికల నిర్వహణ విధులకు నియమించిన ఉద్యోగుల పూర్తి డేటాను వెంటనే సమర్పించాలని మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి డీఈఓ భిక్షపతిని ఆదేశించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం అన్ని శాఖల అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు. పొరపాట్లకు తావివ్వ వద్దని గ్రామపంచాయతీ ఎన్నికలతో పాటు శాఖల ద్వారా నిర్వహించే ఇతర పనులను జాప్యం లేకుండా చూడాలన్నారు. ఆయా నోడల్ అధికారులు చేయాల్సిన విధులు, కార్యాచరణ ప్రణాళికను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. నామినేషన్లకు సంబంధించిన ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక వసతుల కల్పన, కౌంటింగ్ ఏర్పాట్లు, కౌంటింగ్ సిబ్బంది నియామకం వంటి పనులపై నోడల్ అధికారులు దృష్టి సారించాలన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, డీపీఓ వెంకయ్య పాల్గొన్నారు.
ఎన్నికల నిర్వహణలో తప్పులు జరగొద్దు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి తప్పలు జరగకుండా చూడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం నల్లగొండలోని ప్రతీక్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రెసిడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల నియమ, నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. పీఓ హాండ్ బుక్‌ను చదవాలని సూచించారు. పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు. ఎన్నికల కమిషన్ అనుమతించిన వారిని మాత్రమే పోలింగ్ కేంద్రంలోకి అనుమతించాలని పేర్కొన్నారు. కేటాయించిన ఉద్యోగులు తప్పనిసరిగా విధులకు హాజరుకావాలని, లేనిపక్షంలో ఎన్నికల నిబంధనలు ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో శిక్షణ అధికారి రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఆమె సమావేశమయ్యారు. ఎన్నికల షెడ్యూల్, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లు, తదితర అంశాలను వారికి వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహిస్తున్నామని.. మొదటి విడతలో నల్లగొండ, దేవరకొండ, రెండో విడతలో చండూరు, మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. నల్లగొండ కలెక్టరేట్‌లో ఎన్నికల హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎస్పీ శరత్‌చంద్ర పవార్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయ పార్టీల సమావేశాలు, ర్యాలీలకు అనుమతి తీసుకోవాలన్నారు. సమావేశంలో వివిధ పార్టీల నాయకులు గుమ్మల మోహన్‌రెడ్డి, మాధవరెడ్డి, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి