
పలు గ్రామాల్లో పంచాయతీ పోరుకు అభ్యర్థులు కరువు
● అడవిదేవులపల్లి మండలంలోని జిలకరకుంటతండా గ్రామ పంచాయతీ గతంలో ఎస్టీ జనరల్ కాగా ఈ సారి బీసీ మహిళకు రిజర్వు అయింది. ఆ గ్రామంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబం ఒక్కటే ఉంది.
● గోన్యతండా గతంలో ఎస్టీ మహిళ కాగా ఈ సారి బీసీ జనరల్ రిజర్వు అయింది. అక్కడ కేవలం బీసీ సామాజిక వర్గం నుంచి రెండు కుటుంబాలు మాత్రమే ఉన్నాయి.
● ముదిమాణిక్యం గతంలో జనరల్ మహిళ కాగా ఈ సారి ఎస్టీ జనరల్‌గా రిజర్వేషన్ అయింది. ఈ గ్రామంలో రెండు మాత్రమే ఎస్టీ కుటుంబాలు ఉన్నాయి.
● దామరచర్ల మండలంలోని తూర్పుతండా బీసీలకు రిజర్వ్ అయ్యింది. ఇక్కడ ఒక్క కుటుంబమే ఉంది.
● మాడుగులపల్లి మండలంలోని ఇందుగుల గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానం ఎస్టీకి రిజర్వ్ అయింది. గ్రామంలో మొత్తం 1925 మంది ఓటర్లు ఉండగా అందులో కేవలం బానోతు శాంతి, బోడ నవీన్ అనే ఎస్టీలకు మాత్రమే ఓట్లు ఉన్నాయి.
● గజలాపురం గ్రామపంచాయతీ ఎస్టీకి రిజర్వ్ చేశారు. గ్రామంలో ఎస్టీ కుటుంబం ఒక్కటే ఉంది. అయితే ఇక్కడ ఎస్టీలకు రెండు వార్డులు కేటాయించారు.
● పెద్దవూర మండలంలో పులిచర్ల గ్రామపంచాయతీ ఎస్టీ మహిళకు కేటాయించారు ఇక్కడ ఎస్టీలకు సంబంధించి ఐదు ఓట్లు మాత్రమే ఉన్నాయి.
● చందంపేట మండలంలోని గుంటిపల్లి బీసీకి రిజర్వ్ అయింది. ఇక్కడ బీసీ కుటుంబం ఒక్కటే ఉంది. మరో కుటుంబంలో భర్త బీసీ, భార్య ఎస్టీ ఉన్నారు.
● దేవరకొండ మండలం దుబ్బతండా గ్రామపంచాయతీ బీసీ మహిళకు రిజర్వు అయింది. అయితే అక్కడ బీసీ మహిళ ఒక్కరే ఉన్నారు.
● వెంకటితండా బీసీ జనరల్‌కు రిజర్వు అయింది. అయితే అక్కడ మూడే బీసీ ఓట్లు ఉన్నాయి.
నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని అనుముల మండలం పేరూర్ గ్రామ సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. పేరూర్ గ్రామ పంచాయతీలో 792 మంది ఓటర్లలో ఒకే ఒక్క ఎస్టీ పురుషుడికే ఓటు హక్కు ఉంది. అయితే ఇక్కడ సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళ రిజర్వు అయింది. దీంతో అభ్యర్థేలేని పరిస్థితి నెలకొంది.
ఫ రిజర్వేషన్ ప్రకారం సర్పంచ్‌లే కాదు వార్డుల్లోనూ సభ్యుల్లేరు..
ఫ పలుచోట్ల ఒకటీ రెండు కుటుంబాల వారికే దక్కిన రిజర్వేషన్
ఫ గిరిజనులు ఉండే ప్రాంతాల్లోని సర్పంచ్ పదవులు బీసీలకు రిజర్వు
ఫ ఇంకొన్ని చోట్ల ఒకరే అభ్యర్థి
ఉండడంతో ఏకగ్రీవానికి అవకాశం
ఫ కొన్ని గ్రామాల్లో ఎస్సీలకు అసలు
ఒక్క సీటూ రిజర్వు కాలే..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : స్థానిక సంస్థల ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. జిల్లాలోని పలు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులతోపాటు వార్డు సభ్యుల కొరత కూడా నెలకొంది. దీంతో అభ్యర్థుల కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు వెతుకులాటలో పడ్డాయి. కొన్నిచోట్ల ఒకటీ రెండు కుటుంబాలే ఉన్నా, వారికే ఆ స్థానాలు రిజర్వు అయ్యారు. దీంతో అక్కడ పంచాయతీలు ఏకగ్రీవం కానున్నాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో బీసీలకు సర్పంచ్ స్థానాలు రిజర్వు కాగా, అక్కడ బీసీ అభ్యర్థులే లేని విచిత్ర పరిస్థితి నెలకొంది. అలాంటి వాటిల్లో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారన్నది గందరగోళంగా మారింది. అభ్యర్థులే లేకుండా ఎలా ముందుకు వెళతారన్నదానిపైనా స్పష్టత రావాల్సి ఉంది. మరికొన్ని మండలాల్లో ఎస్సీలకు ఒక్క సీటు కూడా దక్కకపోవడంతో వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఇక్కడ అసలు అభ్యర్థులు లేరు..
దామరచర్ల మండలంలో జైత్రాంతండా, బాండావత్‌తండా, గోన్యతండా, బాలాజీనగర్‌తండా, మాన్‌తండా, నూనావత్‌తండాలే బీసీలకు రిజర్వ్ అయ్యాయి. కానీ ఈ తండాల్లో బీసీ ఓటర్లే లేరు. అక్కడ సర్పంచ్ పదవి నామినేషన్ వేసే వారే లేకుండాపోయారు.
అడవిదేవులపల్లి మండలంలోని చాంప్లాతండా గతంలో ఎస్టీ జనరల్ కాగా ఈ సారి బీసీ జనరల్‌కు రిజర్వు అయింది. అక్కడ ఒక్క బీసీ కూడా లేరు.
తిరుమలగిరి(సాగర్) మండలంలో చింతలపాలెం గ్రామపంచాయతీ ఎస్టీ జనరల్‌గా రిజర్వు అయింది. అయితే అక్కడ ఎస్టీలు ఒక్కరూ లేరు.
దేవరకొండ నియోజకవర్గంలోని నేరేడుగొమ్ము మండలంలో బచ్చాపురం సర్పంచ్ బీసీకి రిజర్వ్ అయింది ఇక్కడ బీసీ కుటుంబాలు ఒక్కటీ లేవు. 2011లో ఒక కుటుంబం ఉండేది. ఇప్పుడు ఆ కుటుంబం కూడా అక్కడ లేదు.
ఎస్సీలకు ఒక్క వార్డూ కేటాయించలే..
మాడుగులపల్లి మండలంలోని అభంగాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానం ఎస్టీకి రిజర్వ్ అయింది. గ్రామంలో 881 మంది ఓట్లు ఉండగా అందులో ఎస్టీ వారు ఒక్కరు కూడా లేరు. వార్డుల్లో ఎస్టీలకు 3, బీసీలకు 4, జనరల్‌కు ఒక స్థానం కేటాయించగా గ్రామంలో ఎక్కువగా ఉన్న మాల, మాదిగ సామాజికవర్గం కుటుంబాలు ఉన్నప్పటికీ ఎస్సీలకు రిజర్వేషన్‌లో స్థానం కల్పించలేదు.
మాడుగులపల్లి మండలంలోని ఇందుగుల గ్రామంలో పది వార్డులు ఉండగా బీసీలకు నాలుగు వార్డులు కేటాయించగా నాలుగు వార్డులు ఎస్టీ, రెండు జనరల్ స్థానాలు కేటాయించారు. పది వార్డుల్లో ఒక్క స్థానం కూడా ఎస్సీలకు కేటాయించలేదు. గ్రామం మొత్తంలో ఇద్దరే ఎస్టీ ఓటర్లు ఉన్నారు.

పలు గ్రామాల్లో పంచాయతీ పోరుకు అభ్యర్థులు కరువు