
స్థానిక ఎన్నికలు సవ్యంగా నిర్వహించాలి
నల్లగొండ: జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను సవ్యంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణి కుముదిని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్‌ను నిర్వహించారు. దీనికి హాజరైన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మొదటి విడత నల్లగొండ, దేవరకొండ డివిజన్లకు సంబంధించి 18 మండలాలు, రెండవ విడతన చండూరు, మిర్యాలగూడ డివిజన్లకు సంబంధించి 15 మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత నల్లగొండ, చండూరు డివిజన్లలో 318 గ్రామపంచాయతీలు, రెండవ విడత మిర్యాలగూడ డివిజన్లలో 282 గ్రామపంచాయతీలు, మూడవ విడత దేవరకొండ డివిజన్ పరిధిలోని 269 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఎన్నికల నిర్వహణకు 996 బ్యాలెట్ బాక్స్‌లు అవసరమని పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్నికలపై ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలకు శిక్షణ ఇచ్చామన్నారు. ఈనెల 30న రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ శరత్‌చంద్ర పవార్, అదనపు ఇన్‌చార్జ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, దేవరకొండ ఏసీపీ మౌనిక, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, డీపీఓ వెంకయ్య, హౌసింగ్ పీడీ రాజ్‌కుమార్, ఆర్డీఓలు వై.అశోక్‌రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి, డీఈఓ భిక్షపతి, ఆర్టీఓ లావణ్య అధికారులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి