
ఇచ్చిన హామీలు అమలు చేశాం
నల్లగొండ: ఇచ్చిన హామీలు అమలు చేశామని, బీఆర్‌ఎస్ నేతలు దమ్ముంటే చర్చకు రావాలని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్‌నాయక్ అన్నారు. సోమవారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ బీఆర్‌ఎస్ బాకీ కార్డుల పోస్టర్‌ను విడుదలచేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్‌ఎస్ ఎలాంటి అభివృద్ధి చేయకుండా ప్రాజెక్టుల పేరుతో పేదల సొమ్మును దోచుకుందని విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీ ఎస్సీలకు మూడెకరాల భూమి పంపిణీ, రైతులకు రుణమాఫీ, ఐదు సంవత్సరాల వడ్డీ బాకీ, నిరుద్యోగులకు నెలకు రూ.3000 బాకీ, పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల బాకీలు పడిందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో మంత్రిగా ఉన్న జగదీష్‌రెడ్డి చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న జగదీష్‌రెడ్డిని గొల్లగూడ ప్రభుత్వ ఆస్పత్రిలో అడ్మిట్ చేయాలన్నారు. తిప్పర్తిలో ఆరు గ్యారంటీలపై విడుదల చేసిన కార్డుపై నల్లగొండ సెంటర్‌లో చర్చకు రావాలని జగదీష్‌రెడ్డికి సవాల్ విసిరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి సూర్యాపేట సీటు కూడా దక్కదన్నారు. ఈ సమావేశంలో నల్లగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కనగల్ మండల అధ్యక్షుడు గడ్డం అనూప్‌రెడ్డి, చీదేటి వెంకట్‌రెడ్డి, షబ్బీర్ బాబా, మామిడి కార్తీక్, గాలి నాగరాజు, కొప్పు నవీన్‌గౌడ్, పిల్లి యాదగిరి యాదవ్, కిన్నెర అంజి, పెరికె చిట్టి, విజయ్ పాల్గొన్నారు.
ఫ బీఆర్‌ఎస్ నేతలు దమ్ముంటే చర్చకు రావాలి
ఫ ఎమ్మెల్సీ కేతావత్ శంకర్‌నాయక్