
మోగిన స్థానిక నగారా
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: స్థానిక సంస్థల సమరానికి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే నెల 9వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు మొదటి విడత నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లాలో రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, మూడు విడతల్లో పంచాతీయ ఎన్నికలను నిర్వహించేలా షెడ్యూలు జారీ చేసింది. దీంతో జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
ముందుగా ఎంపీటీసీ,
జెడ్పీటీసీ స్థానాలకు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలను నిర్వహించేలా ఎన్నికల సంఘం షెడ్యూలు జారీ చేసింది. ఆ తరువాత గ్రామ పంచాయతీల ఎన్నికలను నిర్వహించనుంది. జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను మొదటి విడతలో 18 మండలాల్లో ఎన్నికలకు వచ్చేనెల 9న నోటిఫికేషన్ జారీ చేసి, 23న ఎన్నికలను నిర్వహించనుంది. రెండో విడతలో 15 మండలాల్లో ఎన్నికలకు వచ్చే నెల 13న నోటిఫికేషన్ జారీ చేసి, 27న పోలింగ్ నిర్వహించేలా షెడ్యూల్ జారీ చేసింది.
డివిజన్ల వారీగా పల్లెపోరు
ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడతలో నల్లగొండ, చండూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 14 మండలాల్లో అక్టోబర్ 31న ఎన్నికలు నిర్వహించనుంది. ఇందుకోసం వచ్చే నెల 17వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇక రెండో విడతలో మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని 10 మండలాల్లోఎన్నికలకు వచ్చే నెల 21వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసి, నవంబర్ 4వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది. మూడో విడతలో దేవరకొండ డివిజన్ పరిధిలోని 9 మండలాల్లో ఎన్నికలకు వచ్చే నెల 25వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసి, నవంబర్ 8వ తేదీన ఎన్నికలను నిర్వహించనుంది. అదే రోజు ఫలితాలు వెల్లడించనుంది.
353 ఎంపీటీసీ, 33 జెడ్పీటీసీలు
జిల్లాలో 353 ఎంపీటీసీ, 33 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలను 1,957 పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించనుంది. మొదటి విడతలో నల్లగొండ, దేవరకొండ డివిజన్లలోని 196 ఎంపీటీసీ స్థానాలకు 483 గ్రామాలు, 4,152 వార్డుల్లో ఎన్నికలను నిర్వహించనుంది. ఇందుకోసం 516 ప్రాంతాల్లో 1,099 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. రెండో విడతలో చండూరు, మిర్యాలగూడ డివిజన్లలోని 157 ఎంపీటీసీ స్థానాలకు 386 గ్రామాలు, 3,342 వార్డుల్లో ఎన్నికలను నిర్వహించనుంది. ఇందుకు 419 ప్రాంతాల్లో 858 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనుంది.
869 గ్రామాలు.. 7,494 వార్డులు
జిల్లాలో 33 మండలాల పరిధిలోని 869 గ్రామ పంచాయతీలకు, వాటి పరిధిలోని 7,494 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి విడతలో నల్లగొండ, చండూరు డివిజన్ల పరిధిలోని 14 మండలాల్లోని 318 గ్రామాలు, 2,870 వార్డులకు ఎన్నికలు జరుగున్నాయి. రెండో విడతలో మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని 10 మండలాలకు చెందిన 282 గ్రామాలు, 2,418 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. మూడో విడతలో దేవరకొండ డివిజన్ పరిధిలోని 9 మండలాలకు చెందిన 269 గ్రామాలు, 2,206 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు.
దాదాపు సగం సర్పంచ్ స్థానాలు బీసీలకే..
జిల్లాలోని 869 గ్రామ పంచాయతీల్లో పూర్తిగా గిరిజనులకు కేటాయించినవి పోగా మిగితా 755 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 42 శాతం రిజర్వేషన్ల ప్రకారం దాదాపు సగం సర్పంచ్ పదవులు బీసీలకు లభించనున్నాయి. 147 స్థానాలు పూర్తిగా బీసీ మహిళలకు కేటాయించగా, 163 బీసీ జనరల్‌కు కేటాయించారు. ఇలా మొత్తంగా 310 సర్పంచ్ స్థానాలు, 2,638 వార్డులు బీసీలకు దక్కనున్నాయి.
114 గిరిజన గ్రామ పంచాయతీలు
తండాలుగా మార్చిన 114 గిరిజన గ్రామ పంచాయతీలన్నీ వారికే రిజర్వు అయ్యాయి. వాటిల్లో 856 వార్డులు ఉన్నాయి. ఆయా గ్రామ పంచాయతీలతోపాటు రిజర్వేషన్ల కోటా మేరకు అదనంగా మరో 78 పంచాయతీలు ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. వాటి పరిధిలోని 577 వార్డులు గిరిజనులకే దక్కనున్నాయి. దీంతో ఈసారి మొత్తంగా గిరిజన సర్పంచ్‌ల సంఖ్య 192కు చేరనుండగా, 1,433 వార్డుల సభ్యులు గిరిజనులే ఉండనున్నాయి. ఇక ఎస్సీలకు 153 సర్పంచ్ స్థానాలు, 1,281 వార్డులు లభించనున్నాయి. అన్ రిజర్వుడ్ కేటగిరీలో 214 పంచాయతీలు ఉన్నాయి. అన్ని కేటగిరీల్లో 50 శాతం మహిళలకు కేటాయించారు.
ఓటు హక్కు వినియోగించుకోనున్న 10.73 లక్షల మంది
10,73,506 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారిలో 5,30,860 మంది పురుషులు, 5,42,589 మంది మహిళలు, 57 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు.
పార్టీ గుర్తులపై ఎంపీటీసీ,
జెడ్పీటీసీ ఎన్నికలు
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పార్టీ గుర్తులపైనే నిర్వహించనున్నారు. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తిగా రాజకీయ పార్టీలకు అతీతంగా జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌ను వినియోగిస్తున్నారు. ఈవీఎంల మాదిరిగానే బ్యాలెట్ పేపర్లపై కూడా ‘నోటా’ గుర్తును ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, పంచాయతీ ఎన్నికలకు ఉదయం 7 గంటలనుంచి మధ్యాహ్నం 1 గంట దాకా పోలింగ్ జరుగుతుంది. గంట భోజన విరామం తర్వాత పోలింగ్ జరిగిన రోజే మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి, విజేతలను ప్రకటిస్తారు. మరునాడు ఉప సర్పంచ్‌ల ఎన్నిక ఉంటుంది. ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మాత్రం నవంబర్ 11న ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుంది.
ఐదు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
ఫ వచ్చే నెల 23, 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
ఫ నవంబర్ 11న ఓట్ల లెక్కింపు, ఫలితాలు
ఫ వచ్చే నెల 31, నవంబర్ 4, 8న పంచాయతీలకు..
ఫ పోలింగ్ రోజు సాయంత్రమే ఫలితాలు
ఫ అమలులోకి వచ్చిన ఎన్నికల కోడ్
మొదటి విడత సర్పంచ్ ఎన్నికల వివరాలు..
డివిజన్ పంచాయతీలు పోలింగ్ కేంద్రాలు
నల్లగొండ 214 1,946
చండూరు 104 924
రెండోవిడతలో..
మిర్యాలగూడ 282 2,418
మూడో విడతలో
దేవరకొండ 269 2,206
తొలి విడత ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన వివరాలు..
ఎంపీటీసీలు గ్రామాలు వార్డులు పోలింగ్‌కేంద్రాలు
196 483 4,152 1,099
రెండు విడతలో..
353 869 7,494 1,957
ఎంపీటీసీ స్థానాలు 353 పంచాయతీ వార్డులు 7,494
మొత్తం పోలింగ్‌స్టేషన్లు 1957 పోలింగ్‌బాక్స్‌లు: 9,996
పోలింగ్ సిబ్బంది పీవోలు 2,348, ఓపీవో 10,982
అధికారులు: జెడ్పీటీసీ ఆర్‌వోలు 39, ఎంపీటీసీ ఆర్‌వోలు 140, ఏఆర్‌వోలు 140
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 652 సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు 304
అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 18