
ఐదు రోజులుగా ధర్నా చేస్తున్నా పట్టించుకోరా..
ఫ మెడికల్ కళాశాల ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఆవేదన
ఫ నాలుగు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని వేడుకోలు
నల్లగొండ టౌన్ : ఏజెన్సీ నిర్వాహకులు తమకు నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని నల్లగొండ మెడికల్ కళాశాలలో శానిటేషన్, సెక్యూరిటీ విభాగాల్లో ఔట్‌సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నుంచి విధులను బహిష్కరించి మెడికల్ కళాశాల ప్రధాన ద్వారం వద్ద ధర్నా చేస్తున్నారు. వీరు చేపట్టిన ధర్నా గురువారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నాయకులు నారబోయిన ప్రశాంత్, రాజు మాట్లాడుతూ అతి తక్కువ వేతనాలలో తాము విధులు నిర్వహిస్తున్నామని, అయినా నెలనెలా వేతనాలు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. జీతా లే కాకుండా ఆరు నెలలుగా ఏజెన్సీ నిర్వాహకులు తమకు పీఎఫ్, ఈఎస్‌ఐ చెల్లింపులు చేయడం లేదన్నారు. వెంటనే అధికారులు స్పందించి దసరాకు తమ నాలుగు నెలల వేతనాలను ఇప్పించాలని వేడుకుంటున్నారు. కార్యక్రమంలో మఽధుమురళి, అండాలు, చంద్రమ్మ, మంగమ్మ పాల్గొన్నారు.