గర్భిణి మృతి కేసులో మరో ముగ్గురు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

గర్భిణి మృతి కేసులో మరో ముగ్గురు అరెస్టు

Sep 2 2025 7:41 PM | Updated on Sep 2 2025 7:41 PM

గర్భిణి మృతి కేసులో మరో ముగ్గురు అరెస్టు

గర్భిణి మృతి కేసులో మరో ముగ్గురు అరెస్టు

సూర్యాపేటటౌన్‌ : అబార్షన్‌ చేయడంతో వైద్యం వికటించి గర్భిణి మృతి చెందిన కేసులో మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ ప్రసన్నకుమార్‌ తెలి పారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. మోతె మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన ఐదు నెలల గర్భిణి బయ్య అనూష మృతి చెందిన కేసులో సూర్యాపేట పట్టణంలోని ఒమేగా హాస్పిటల్‌లో అబార్షన్‌కు ఏర్పాట్లు చేసిన హాస్పిటల్‌ నిర్వాహకుడు ఏ1 గోరంట్ల సంజీవ, సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు ఏ2 జాల జానయ్యను, ఒమెగా ఆస్పత్రి మేనేజ్‌మెంట్‌ ఏ6 వేణును సూర్యాపేటలోని ఓ హోటల్‌ వద్ద అరెస్టు చేశారు.

మూడోసారి ఆడపిల్ల అని

తెలియడంతో అబార్షన్‌

మోతె మండలం రాఘవపురం గ్రామానికి చెందిన బయ్య నగేష్‌కు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. భార్య అనూష మూడోసారి ప్రెగ్నెంట్‌ కాగా.. లింగ నిర్ధారణ పరీక్ష చేసేందుకు తన దగ్గరి బంధువైన అదే గ్రామానికి చెందిన ఏ8 ఉప్పల సందీప్‌ ద్వారా టేకుమట్ల గ్రామంలో ఆర్‌ఎంపీగా పని చేస్తున్న ఏ2 జాల జానయ్యను సంప్రదించాడు. నకిరేకల్‌కు చెందిన ఆర్‌ఎంపీ ఏ3 బాత్క యాదగిరి వద్ద మే 17న అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ నిర్వహించి గర్భంలో ఉంది ఆడ శిశువు అని తెలుసుకున్నారు. స్కానింగ్‌ చేయించినందుకు ఆర్‌ఎంపీ జానయ్య ఏ9 బయ్య నగేష్‌ వద్ద రూ.12వేలు తీసుకున్నాడు. అబార్షన్‌ చేయించేందుకు జిల్లా కేంద్రంలోని ఒమేగా హాస్పిటల్‌(సంజీవిని హాస్పిటల్‌) నిర్వాహకులు గోరెంట్ల సంజీవ, వీరబోయిన వేణును సంప్రదించి కూసుమంచికి చెందిన నాగరాజు, అర్వపల్లికి చెందిన చెవుగోని గణేష్‌లతో అబార్షన్‌ చేయించారు. గర్భిణీకి వైద్యం వికటించి తీవ్ర రక్తస్రావం కావడంతో ఖమ్మంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్ష చేసిన వైద్యులు అనూష అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ విషయమై జిల్లా వైద్యాధికారి కార్యాలయం వారు సూర్యాపేట పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపి కేసులో మొత్తం 10 మంది నిందితులను గుర్తించినట్లు డీఎస్పీ తెలిపారు.

ఇప్పటికే నలుగురు రిమాండ్‌

ఈ కేసులో ఇప్పటికే ఏ8 అయిన ఉప్పల సందీప్‌ను, అబార్షన్‌ చేసిన చెవుగోని గణేష్‌ను మే 29న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. అదేవిధంగా నకిరేకల్‌లో గర్భిణికి స్కానింగ్‌ చేసిన ఆర్‌ఎంపీ డాక్టర్‌ బాత్క యాదగిరిని ఆగస్టు 8న అరెస్టు చేసినట్లు చెప్పారు. అలాగే మరో మైనర్‌ వ్యక్తిని కూడా అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో పట్టణ ఇన్‌స్పెక్టర్‌ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

వివరాలు వెల్లడించిన డీఎస్పీ ప్రసన్నకుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement