
యాదగిరీశుడి కల్యాణం అద్భుతం
● శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి కెనడా ప్రధాని ప్రశంస
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని, నిర్వాహకులను కెనడా ప్రధాని మార్క్ కార్నీ అభినందిస్తూ ఆదివారం రాత్రి లేఖ పంపారు. ఆలయ పూజారులు, అర్చకులు కెనడా దేశంలోని వివిధ ప్రాంతాల్లో గత నెలలో ఆలయ విశ్రాంత ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, ఆలయ అధికారి గజివెల్లి రఘు ఆధ్వర్యంలో యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణం జరిపించారు. ఆగస్టు 23న విండ్సర్, 24వ తేదీన టొరంటో నగరంలో, 30న ఒట్టావా నగరంలో కల్యాణం జరిపించారు. ఈ సందర్భంగా కెనడా ప్రధాని మార్క్ కార్నీ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో భక్తులకు అందుతున్న సేవలపై టెంపుల్ బోర్డును అభినందించారు. కెనడాలోని ఒట్టవా నగరంలో గల శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఇటీవల స్వామి వారి కల్యాణం జరిగిన తీరుతెన్నులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. స్వామి వారి కళ్యాణం చాలా ఘనంగా, వైభవముగా, అద్భుతంగా నిర్వహించారని కొనియాడారు. హిందూ సంస్కృతిలోని విభిన్నత, ఆధ్యాత్మికత, ఐక్యతను ప్రశంసించారు. కాగా, కెనడా ప్రధాని మార్క్ కార్నీ లేఖపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆలయ ఈవో వెంకటరావు హర్షం వ్యక్తం చేశారు.