సెల్‌ఫోన్‌ వదిలితేనే సీ్టరింగ్‌ | - | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్‌ వదిలితేనే సీ్టరింగ్‌

Sep 2 2025 7:41 PM | Updated on Sep 2 2025 7:41 PM

సెల్‌ఫోన్‌ వదిలితేనే సీ్టరింగ్‌

సెల్‌ఫోన్‌ వదిలితేనే సీ్టరింగ్‌

మిర్యాలగూడ టౌన్‌ : కొంత మంది ఆర్టీసీ డ్రైవర్లు సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ బస్సు నడుపుతుండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటికి చెక్‌ పెట్టేందుకు ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై డ్యూటీ సమయంలో బస్సు డ్రైవర్లు సెల్‌ఫోన్‌ వాడొద్దని ఆదేశాలు జారీ చేసింది. ముందుగానే సెల్‌ఫోన్లను డిపోలోని సెక్యూరిటీ అధికారి కార్యాలయంలో డిపాజిట్‌ చేసి విధులకు వెళ్లాలని సూచించింది.

ఆయా డిపోల్లో సర్వే నిర్వహించిన ఆర్టీసీ

ఉమ్మడి జిల్లాలో దేవరకొండ, నార్కట్‌పల్లి, యాదగిరిగుట్ట, సూర్యాపేట, కోదాడ, మిర్యాలగూడ, నల్లగొండ డిపోలు ఉండగా గత నెలలో ఆయా డిపోల్లో ఇతర జిల్లాలకు సంబంధించిన ఆర్టీసీ సిబ్బందిని ఒక్కో డిపోకు ఐదుగురు చొప్పున కేటాయించి ఆర్టీసీ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. ఒక్క మిర్యాలగూడ డిపోలో 162 మంది డ్రైవర్లు ఉండగా వీరిలో సుమారు 90 మంది వరకు సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేస్తున్నట్లు సర్వేలో వెల్ల డైంది. దీంతో నల్ల గొండ రీజియన్‌లో మిర్యాలగూడ ఆర్టీసీ డిపోను పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. రాష్ట్రంలో 11 డిపోల్లో ఈ నిర్ణయం తీసుకోగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడ డిపోలో సోమవారం నుంచి అమలు చేసింది. డిపోలో మొత్తం 162 మంది డ్రైవర్లు ఉండగా ప్రతి రోజు 70 నుంచి 100 మంది వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే విధి నిర్వహణలో భాగంగా తొలి రోజు డ్యూటీకి వెళ్లి 38 మంది విధుల్లో చేరే ముందు తన సెల్‌ఫోన్లను డిపోలోని సెక్యూరిటీ అధికారి కార్యాలయంలో డిపాజిట్‌ చేశారు. విధులు ముగించుకున్న తరువాత ఇంటికి వెళ్లేటప్పుడు వీటిని తీసుకువెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు. సెల్‌ఫోన్లను భద్రపరిచేందుకు ప్రత్యేకంగా సంచులను తయారు చేయించారు. ఏదైనా అత్యవసరమైన పరిస్థితుల్లో బస్సులోని సంబంధిత కండక్టర్లకు ఫోన్‌ ద్వారా సమాచారం అందిస్తే డ్రైవర్‌ ఫోన్‌ మాట్లాడేందుకు అవకాశం కల్పించనున్నారు. కాగా.. మిర్యాలగూడ డిపో నుంచి కాకినాడ, తిరుపతికి వెళ్లే బస్సులకు సంబంధించి 12 మంది డ్రైవర్లు ఉండగా దూరపు ప్రయాణంతో పాటు ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకుంటుండటంతో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ డ్రైవర్లకు ఈ నిబంధన మినహాయించారు.

ప్రయాణికుల రక్షణ కోసమే

ఆర్టీసీ తీసుకున్న నిర్ణయాన్ని బస్సు డ్రైవర్లు కూడా స్వాగతిస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా డ్యూటీకి వెళ్లే సమయంలో సెక్యూరిటీ కార్యాలయంలో డిపాజిట్‌ చేస్తున్నారు. ప్రయాణికులను గమ్యస్థానానికి సురక్షితంగా చేర్చాలనేది ఆర్టీసీ లక్ష్యం. అయితే చాలా మంది కూడా తమ సెల్‌ఫోన్లు ఇంటి వద్దనే ఉంచుతుండగా కొంత మంది డిపో వద్ద డిపాజిట్‌ చేసి డ్యూటీ దిగి వెళ్లిపోయే సమయంలో తీసుకెళ్తున్నారు. ఏదైనా అత్యవసరమని అనుకుంటే తాము ఆ బస్సు కండక్టర్‌కు ఫోన్‌ చేసి ఆ డ్రైవర్‌తో మాట్లాడిస్తాం.

– రాంమోహన్‌రెడ్డి,

ఆర్టీసీ డీఎం, మిర్యాలగూడ

బస్సు నడిపే సమయంలో సెల్‌ఫోన్‌ వాడకంపై నిషేధం

సెక్యూరిటీ కార్యాలయం వద్ద

అప్పగించాకే విధులకు వెళ్లాలని సూచన

పైలట్‌ ప్రాజెక్టు కింద

మిర్యాలగూడ ఆర్టీసీ డిపో ఎంపిక

సోమవారం నుంచి అమలులోకి వచ్చిన నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement