
బంగారం, నగదు చోరీ
హుజూర్‌నగర్ : ఓ వ్యక్తి తన భార్యను తీసుకువచ్చేందుకు అత్తగారింటికి వెళ్లి రెండు రోజుల తర్వాత వచ్చే సరికి ఇంట్లో బంగారం, వెండి ఆభరణాలు, నగదు ను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈ సంఘటన హుజూర్‌నగర్ మండలంలోని గోపాలపురంలో సోమవారం వెలుగుచూసింది. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాలపురం గ్రామానికి చెందిన పేరూరి భాగ్యరాజు గత నెల 28న తన భార్యను తీసుకురావడానికి అత్తగారి ఊరైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్నపరెడ్డిపల్లి మండలం ఎరగ్రుంట గ్రామానికి వెళ్లాడు. అక్కడ రెండు రోజులు ఉండి సోమవారం స్వగ్రామం చేరుకున్నారు. ఇంటికి వచ్చి చూడగా తాళం పగలగొట్టి ఇంట్లో వస్తువులు చిందర వందరగా పడేసి ఉన్నాయి. బీరువాను పరిశీలించగా.. అందులోని సుమారు 10 తులాల బంగారు, 20 తులాల వెండి ఆభరణాలు, రూ.5 లక్షల నగదు అపహరణకు గురైంది. విషయం తెలుసుకున్న సీఐ చరమందరాజు, ఎస్‌ఐ మోహన్‌బాబు సంఘటనా స్థలాన్ని క్యూస్ టీంతో సందర్శించి వివరాలు నమోదు చేసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మోహన్‌బాబు తెలిపారు.