
నిమజ్జనానికి సిద్ధంగా..
నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన
5వ తేదీనే నిమజ్జనం
ఫ 5వ తేదీన నీలగిరిలో గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం
ఫ 10 ఫీట్లలోపు విగ్రహాలు వల్లభరావు చెరువులో, పెద్దవి 14వ మైలు వద్ద..
ఫ ఒకటవ నంబర్ విగ్రహం నుంచి శోభాయాత్ర ప్రారంభం
ఫ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన మున్సిపల్ యంత్రాంగం
నల్లగొండ టూటౌన్ : నీలగిరి పట్టణంలోని వినాయక విగ్రహాల నిమజ్జనానికి మున్సిపల్ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈనెల 5వతేదీన అన్ని విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 48 వార్డుల్లో పెద్ద విగ్రహాలు 715 ఉన్నాయి. ఐదు ఫీట్ల వరకు ఉండే విగ్రహాలు కూడా లెక్కలోకి తీసుకుంటే వెయ్యి వరకు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భారీ శోభాయాత్ర నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 10 ఫీట్లలోపు విగ్రహాలను ఆర్జాలబావి సమీపంలోని వల్లభరావు చెరువులో, అంతకంటే ఎత్తు ఉన్న విగ్రహాలను అనుముల మండలం 14వ మైలు వద్ద ఎడమకాల్వలో నిమజ్జనం చేయనున్నారు. నిమజ్జన ప్రదేశాల్లో భారీ క్రేన్లను ఏర్పాటు చేస్తున్నారు.
పాతబస్తీ నుంచి శోభాయాత్ర
పాతబస్తీ హనుమాన్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఒకటో నంబర్ వినాయక విగ్రహం వద్ద మంత్రి, కలెక్టర్‌తో, ఉత్సవ సమితి పెద్దలు ప్రత్యేక పూజలు చేసిన తరువాత నిమజ్జన శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఇక్కడి నుంచి మొదలయ్యే శోభాయాత్ర రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పెద్ద గడియారం సెంటర్‌కు చేరుకోనుంది. భారీ విగ్రహాలను ట్రాక్టర్లు, లారీల్లో ఎక్కించడానికి మున్సిపాలిటీ అధికారులు నాలుగు క్రేన్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.
మూడు చోట్ల వేదికలు, లైటింగ్
గణేష్ శోభాయాత్ర సందర్భంగా నల్లగొండ పట్టణంలోని ఒకటో నంబర్ విగ్రహం, పెద్ద గడియారం సెంటర్, వల్లభరావు చెరువు వద్ద మూడు వేదికలు ఏర్పాటు చేయనున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలను విద్యుద్దీపాలతో అలంకరించనున్నారు. శోభాయాత్ర, నిమజ్జనం సందర్భంగా మున్సిపల్ యంత్రాంగం 500 మంది ఉద్యోగులను విధుల్లో ఉంచుతుంది. వల్లభరావు చెరువు వద్ద మూడు షిఫ్ట్‌ల్లో కార్మికులు విధులు నిర్వహించనున్నారు. ఇప్పటికే వల్లభరావు చెరువులో గుర్రపు డెక్క తొలగించి చెరువు వద్ద చెత్త, చెదారం తొలగించి, బ్లీచింగ్ పౌడర్ చల్లారు.
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ సమీపంలోని వల్లభరావు చెరువులో నిమజ్జనం జరిగే ప్రాంతంలో ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి.. ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 5న గణేష్ నిమజ్జనం జరగనున్న దృష్ట్యా వల్లభరావు చెరువుతోపాటు, హాలియా సమీపంలోని 14వ మైలు వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. క్రేన్లు ఏర్పాటు చేయాలని, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని, లైటింగ్, తాగునీరు, బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆమె వెంట ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, డీఎస్పీ శివరాంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ ఉన్నారు.
ఈనెల 5వతేదీనే అన్ని విగ్రహాలను నిమజ్జనం చేయాలని నిర్ణయించాం. గ్రహణం కారణంగా గణేష్ మండపాల నిర్వాహకులకు విషయాన్ని తెలియజేశాం. ప్రశాంత వాతవరణంలో శోభాయాత్ర, నిమజ్జనం పూర్తి చేస్తాం.
– కర్నాటి యాదగిరి, ఉత్సవ సమితి అధ్యక్షుడు

నిమజ్జనానికి సిద్ధంగా..