
1న వైటీపీఎస్‌కు డిప్యూటీ సీఎం, మంత్రుల రాక
మిర్యాలగూడ : దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలోని యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్ (వైటీపీఎస్)కు ఆగస్టు 1న డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ రానున్నారు. పవర్ ప్లాంట్‌లోని యూనిట్–1ను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. దీని ద్వారా 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కానుంది. అనంతరం కృష్ణాతీరంలో జెన్‌కో టౌన్‌షిప్ కోసం భూమి పూజ చేయనున్నారు.
ఉపాధి సిబ్బందికి
వేతనాలు మంజూరు
చిట్యాల : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు మూడు నెలల వేతనాలు విడుదలయ్యాయి. ఉద్యోగులకు నాలుగు నెలలుగా వేతనాలు అందకపోవడంతో ఈ నెల 26న ‘సాక్షి’లో ‘ఉపాధి సిబ్బందికి వేతన ఇక్కట్లు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. వారికి మూడు నెలల వేతనాలను మంగళవారం రాత్రి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.
యూరియా అక్రమ రవాణాపై విచారణ
చిట్యాల: మండలంలోని వెలిమినేడు గ్రామంలో మూడు రోజుల క్రితం జరిగిన యూరియా అక్రమ రవాణా ఘటనపై బుధవారం జిల్లా వ్యవసాయాధికారి, మండల ప్రత్యేకాధికారి పి.శ్రావణ్‌కుమార్ విచారణ చేపట్టారు. వెలిమినేడు పీఏసీఎస్ కార్యాయంలోని సిబ్బందితో మాట్లాడి జరిగిన యూరియా రవాణాపై వివరాలను సేకరించారు. అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట ఏఓ గిరిబాబు ఉన్నారు.
మున్సిపాలిటీ
ఆదాయం పెంచుకోవాలి
నల్లగొండ టూటౌన్ : అనుమతి లేకుండా చేపట్టే నిర్మాణాలు, నల్లా కనెక్షన్లు గుర్తించి వాటికి అనుమతులు ఇవ్వడంతో పాటు అసిస్మెంట్ చేయడం ద్వారా మున్సిపాలిటీ ఆదాయ వనరులు పెంచుకోవాలని మున్సిపల్ జాయింట్ డైరెక్టర్ బోనగిరి శ్రీనివాస్ అన్నారు. వంద రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా బుధవారం నల్లగొండకు వచ్చిన ఆయన డంపింగ్‌యార్డు, పలు వార్డులకు వెళ్లి తడి చెత్త, పొడి చెత్త సేకరణపై ఆరా తీశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మున్సిపల్ ఉద్యోగులు, వార్డు ఆఫీసర్లతో సమావేశమై మాట్లాడారు. ప్రతి ఇంటికి అసిస్మెంట్ చేసి ఇంటి నంబర్ ఇవ్వాలని, ఇందుకు వార్డు ఆఫీసర్లు వార్డుల్లో తిరిగి సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణంలో 43 వేల భవనాలు ఉండగా, నల్లా కనెక్షన్‌లు తక్కువగా ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. అక్రమ కనెక్షన్‌లను గుర్తించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనుమతి లేని నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని, తడి చెత్త, పొడి చెత్త వేరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మంచి ర్యాంకు సాధించేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రవీందర్‌రెడ్డి, రెవెన్యూ ఆఫీసర్ శివరాంరెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ప్రదీప్‌రెడ్డి, జి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

1న వైటీపీఎస్‌కు డిప్యూటీ సీఎం, మంత్రుల రాక