
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి
నల్లగొండ టౌన్ : జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఆయిల్‌పామ్ ప్యాక్టరీ నిర్మించాలని కోరారు. కరువు పీడిత ప్రాంతాలైన మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలను సస్యశ్యామలం చేయడం కోసం ఆనాడు కేసీఆర్ డిండి ఎత్తిపోతల పథకానికి హడావుడిగా శంకుస్థాపన చేశారని చెప్పారు. ఆ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా, ప్రాజెక్టు డీపీఆర్ ఆమోదించకుండా, ప్రాజెక్టుకు నీరు ఎక్కడి నుంచి తెస్తారో స్పష్టత ఇవ్వలేదన్నారు. ఈ నెల 15న దేవరకొండలో నిర్వహించిన సీపీఐ జిల్లా మహాసభలో తను జిల్లా కార్యదర్శిగా, సహాయ కార్యదర్శులుగా పల్లా దేవేందర్‌రెడ్డి, లొడింగి శ్రవణ్‌కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారన్నారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసి నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు నిర్మించడానికి కుట్రలు చేస్తుందని ఆరోపించారు. మునుగోడులో కిష్టాపురం, గట్టుప్పల్, చిట్యాల మండలంలోని వెలిమినేడు ప్రాంతాల్లో విచ్చలవిడిగా ఫార్మ కంపెనీలు నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నారని దీన్ని అడ్డుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్‌రెడ్డి, లొడంగి శ్రవణ్‌కుమార్, పబ్బు వీరస్వామి, నర్సింహ, రామచంద్రం, రామలింగయ్య, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం