
నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలి
మిర్యాలగూడ : నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ నారాయణ్‌అమిత్, డీఎస్పీ రాజశేఖర్‌రాజు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌తో కలిసి సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధికై తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలో డ్రెయినేజీ, విద్యుత్, రోడ్లు తదితర సమస్యల పరిష్కారం కోసం స్పెషల్ డ్రైవ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఐదు వార్డుల చొప్పున ఆయా కాలనీలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, చిరు వ్యాపారుల సమస్యలు, రోడ్డు మీద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను తొలగించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 2వేల ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు గాను ఇసుక కొరతను నివారించేందుకు స్యాండ్ బజార్ ఏర్పాటు చేసి ఇసుకను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అర్హులందరికీ రేషన్‌కార్డులు మంజూరయ్యాయని, రెండు రోజుల్లో పంపిణీ చేస్తామన్నారు. అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.