చిట్యాల : తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ దిగుబడి ఇచ్చే మెట్ట పంటలు, పండ్లు తోటలు, కూరగాయాల సాగు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. చిట్యాల మున్సిపాలిటీ శివారులోని రైతు కొంతం సత్తిరెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని బుధవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ కూరగాయాలు, మామిడి, పుచ్చకాయల సాగును పరిశీలించారు. కూరగాయాలు, పుచ్చకాయల సాగులో తీసుకుంటున్న జాగ్రత్తలు, నీటి వాడకం, దిగుబడి, ఖర్చులు, ఆదాయం, మార్కెటింగ్ వివరాలను ఆమె రైతు సత్తిరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. కొద్దిపాటి నీటితో సేంద్రియ పద్ధతిలో కూరగాయాలు, పండ్ల తోటలను సాగు చేస్తున్నట్లు రైతు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం భూగర్భ జలాలు తగ్గిపోతుండటంతో ఉన్న నీటి వనరులను ఉపయోగించుకుని రైతులు సూక్ష్మసేద్యం, బింధు సేద్యం ద్వారా పంటలను సాగుచేసి ఆర్థికాభివృద్ధి చెందాలని సూచించారు. వచ్చే వానాకాలం వరికి ప్రత్యామ్నాయ పంటలను పండించేందుకు రైతులను సన్నద్ధం చేస్తున్నామని తెలిపారు.
కుంటల్లో నీటి నిల్వకు చర్యలు తీసుకోవాలి
చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో పోతరాజు కుంట, చౌటకుంటలో పూడిక తీసి నీటి నిల్వలకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పట్టణానికి దూరంగా డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఏఓ శ్రవణ్‌కుమార్, ఉద్యానవన శాఖాధికారి అనంతరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వీరేందర్, ఎంపీడీఓ ఎస్‌పీ.జయలక్ష్మి, డీటీ విజయ, ఏఓలు గిరిబాబు, శ్రీను, హార్టికల్చర్ అధికారి శ్వేత, ఏఈఓలు కృష్ణకుమారి, మనిషా, వాసుదేవరెడ్డి, ఏపీఓ శ్రీలత, రైతులు యాస సంజీవరెడ్డి, లింగారెడ్డి, శ్యాంప్రసాద్‌రెడ్డి, జిట్ట బొదయ్య, అజిత్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి