
చౌటుప్పల్‌లో జాతీయ రహదారిపై బారులుదీరిన వాహనాలు
చౌటుప్పల్: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో నివాసముండే ఓటర్లు గురువారం తమ సొంతూళ్లకు వెళ్లడంతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. ఉదయం వాహనాల రద్దీ ఎక్కువగా ఉండగా.. సాయంత్రం కొంతమేర తగ్గింది. పోలింగ్ ముగిశాక ఓటర్లు తిరుగు ప్రయాణమవ్వడంతో మళ్లీ రాత్రి రద్దీ ఎక్కువైంది. దీంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగాయి. ఓ వైపు వాహనాల రద్దీ, మరో వైపు ఓటు వేసేందుకు స్థానికుల రాకపోకల కారణంగా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని జంక్షన్‌ల వద్ద స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వరంగల్ హైవేపై..
బీబీనగర్: ఓట్లు వేసేందుకు ఓటర్లు జనగామ, హన్మకొండ, ఆలేరు, యాదగిరిగుట్ట, వరంగల్ తదితర ప్రాంతాలకు కార్లు, బైకులు, బస్సుల్లో భారీగా తరలిరావడంతో కొండమడుగు మెట్టు నుంచి గూడూరు టోల్‌ప్లాజా వరకు వాహనాలు నాలుగు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. దీంతో హైవే సిబ్బంది వాహనాలను సర్వీస్ రోడ్డు గుండా వాహనాలను మళ్లించారు. ఒక్కో వాహనం టోల్‌ప్లాజా గుండా వెళ్లేందుకు అరగంటకు పైగా సమయం పట్టింది. సాయింత్రం నుంచి ప్రజలు ఓట్లు వేసి తిరుగు ప్రయాణం కావడంతో భువనగిరి వైపు పగిడిపల్లి వరకు వాహనాలు బారులుదీరాయి.

బీబీనగర్: ఎయిమ్స్ సమీపంలో హైవేపై నిలిచిన వాహనాలు