తిమ్మాజిపేట: ఆరుగాలం కష్టించి పండించిన పంట కొనుగోలు చేసిన దళారులు డబ్బులు ఇవ్వకుండా దర్జాగా తిరుగుతూ రైతులను గోసపెడుతున్నారని, రైతులను మోసం చేసే వ్యక్తులను సహించేది లేదని ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి అన్నారు. మండలంలోని అప్పాజిపల్లి, ఇప్పలపల్లి గ్రామాలకు చెందిన కొందరు రైతులు తాము పండించిన మొక్కజొన్న పంట డబ్బులు అత్యవసరం ఉందని ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువ క్వింటాకు రూ.1,700 చొప్పున 250 క్వింటాళ్లు ఇప్పలపల్లికి చెందిన ఓ వ్యక్తికి విక్రయించారు. అయితే రైతులు మొక్కజొన్న అమ్మి రెండు నెలలు గడిచినా.. ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఈ విషయాన్ని మండల నాయకుల ద్వారా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. రైతుల నుంచి మొక్కజొన్న కొనుగోలు చేసిన వ్యక్తి, మధ్య దళారులను స్టేషన్‌కు పిలిపించాలని ఎమ్మెల్యే ఎస్‌ఐ శ్రీనివాసరావుకు సూచించారు. దీంతో ధాన్యం కొన్న వ్యక్తి మినహా దళారులు స్టేషన్‌కు రాగా.. పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న ఎమ్మెల్యే సదరు వ్యక్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతావారు వచ్చే వరకు వీరిని వదలవద్దని, మూడు రోజుల్లో రైతులకు డబ్బులు ఇచ్చేలా చూడాలని ఎమ్మెల్యే ఎస్‌ఐకి సూచించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు వివేక్‌రెడ్డి తదితరులున్నారు.


