20 లక్షల ఎకరాలకు సాగునీరు
● సెప్టెంబర్ 15లోగా పెండింగ్
సమస్యల పరిష్కారానికి కార్యాచరణ
● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
● పాలమూరు– రంగారెడ్డి, కల్వకుర్తి,
డిండి ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష
కందనూలు: రాష్ట్రంలో సాగునీటి రంగ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల నిర్మాణంలో ఎలాంటి జాప్యం లేకుండా భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పాలమూరు– రంగారెడ్డి, కేఎల్‌ఐ ఎత్తిపోతలు, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌తోపాటు నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల పరిధిలో కొనసాగుతున్న వివిధ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణ తదితర అంశాలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులు, నియోజకవర్గాల వారీగా భూ సేకరణ పురోగతిని క్షుణ్ణంగా సమీక్షించారు. ఇప్పటి వరకు ఎంత భూమి సేకరించారు, ఎంత భూమి ప్రాథమిక నోటిఫికేషన్ దశలో ఉంది, ఎంత భూమి పీఎం స్థాయిలో ఉంది, ఎన్ని అవార్డులు ప్రకటించారు, ఎంత పరిహారం చెల్లించారు, ఇంకెన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయనే అంశాలపై అధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల జిల్లాలో నిర్వహించిన సమీక్షాలో సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారని గుర్తు చేశారు. ఈ దిశగా అధికారులు మరింత బాధ్యతతో పనిచేసి పెండింగ్‌లో ఉన్న సమస్యలను సెప్టెంబర్ 15లోగా పూర్తిస్థాయిలో పరిష్కరించాలని సూచించారు. పాలమూరు– రంగారెడ్డి, కల్వకుర్తి, డిండి వంటి ప్రాజెక్టులు పూర్తయితే లక్షలాది ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా భూగర్భ జలాల మట్టం పెరిగి వ్యవసాయ రంగానికి కొత్త ఊపు వస్తుందన్నారు. దశాబ్దాలుగా సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతుల ఆశలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు.
రైతులకు న్యాయమైన పరిహారం..
భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం న్యాయమైన పరిహారం అందించడమే కాకుండా వారి సమస్యలను మానవతా దృక్పథంతో పరిశీలించాలని మంత్రి సూచించారు. రైతుల అభ్యంతరాలు, భూ వివాదాలు, పరిహారం చెల్లింపులకు సంబంధించిన అంశాలను ప్రత్యేకంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సహకారంతోనే ప్రాజెక్టులు పూర్తవుతాయని, అందుకే రైతుల విశ్వాసాన్ని పొందేలా అధికారులు వ్యవహరించాలన్నారు. ప్రతి 15 రోజులకోసారి పురోగతిని సమీక్షిస్తూ నిర్ణీత లక్ష్యాలను చేరుకోవాలన్నారు.
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల పూర్తితోనే వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని, నీటి లభ్యత, పంటల ఉత్పాదకత పెరిగి రైతుల ఆదాయం గణనీయంగా వృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో సాగునీటి ప్రాజెక్టుల పాత్ర అత్యంత కీలకం అని స్పష్టం చేశారు.
ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ జిల్లాలో కొనసాగుతున్న ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే రైతాంగానికి శాశ్వత ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. సాగునీటి వనరులు పెరగడంతో వలసలు తగ్గి గ్రామీణ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పారు.
నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల కలెక్టర్లు హేమంత కేశవ్ పాటిల్, ఆదర్శ్ సురభి, రిజ్వాన్‌బాషా షేక్ తమ తమ జిల్లాల పరిధిలో కొనసాగుతున్న భూ సేకరణ ప్రక్రియపై నివేదికలను అందజేశారు. ఇప్పటి వరకు జరిగిన భూసేకరణ, పరిహారం చెల్లింపులు, పెండింగ్‌లో ఉన్న కేసులు, కోర్టు వివాదాలు, రైతుల అభ్యంతరాలు తదితర అంశాలపై వివరాలు వెల్లడించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, సీఈ విజయభాస్కర్‌రెడ్డి, అదనపు కలెక్టర్ అమరేందర్, ఆయా ప్రాజెక్టుల ఎస్‌ఈలు, ఈఈలు, ఏఈలు, ఆర్డీఓలు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లాలోని రైతాంగం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న సాగునీటి కలను సాకారం చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో పనిచేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల సమీక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి పాలమూరు కరువు, వలసలు, నీటి కొరతకు ప్రతీకగా నిలిచిందని, ఆ పరిస్థితిని పూర్తిగా మార్చి పాలమూరును పచ్చని పంటలతో కళకళలాడే జిల్లాగా తీర్చిదిద్దాలన్నదే రేవంత్‌రెడ్డి సంకల్పం అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో భూసేకరణ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్న మంత్రి, ప్రస్తుతం భూ సేకరణకు సంబంధించిన పెండింగ్ అంశాలపై సమగ్రంగా చర్చించినట్లు తెలిపారు. రైతుల హక్కులకు భంగం కలగకుండా, చట్టబద్ధంగా, పారదర్శకంగా భూసేకరణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు.


