న్యూస్‌రీల్
పాలమూరు: ఆడపిల్లలను పదో తరగతి వరకు చదివించడమే గగణమైన ఆ రోజుల్లో మా నాన్న.. భవిష్యత్‌లో పిల్లలకు చదువు ఎంత అవసరమో ముందే గ్రహించాడు. ఉన్నత చదువుతో మంచి ఉద్యోగాలు వస్తాయనే నమ్మకంతోనే మా ముగ్గురిని కష్టపడి చదివించారని చెబుతోంది మహబూబ్‌నగర్ ఎస్పీ డి.జానకి. మాది నల్లగొండ జిల్లా కోదాడ పట్టణం. దిగువ మధ్య తరగతి కుటుంబం కాగా.. నాన్న పాండు, అమ్మ ఉషకు మేం ముగ్గురం సంతానం (ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి). మా చిన్నతనం నుంచి నాన్న ఒక్కరే కష్టపడేవారు. మాకు ఊళ్లో కనీసం సెంటు భూమి కూడా లేకపోవడంతో నాన్న వ్యవసాయం కాకుండా కోదాడలో చికెన్ సెంటర్ నడిపేవారు. దీని ద్వారా వచ్చిన అరకొర ఆదాయంతో కొంత అద్దె చెల్లించడంతోపాటు మిగిలిన దాంట్లో సర్దుబాటు చేస్తూ ప్రణాళిక ప్రకారం కుటుంబాన్ని పోషిస్తూ మమల్ని చదివించారు. చిన్ననాటి నుంచి నాన్నకు ఒక విజన్ ఉండేది.. ఉన్నత చదువు వల్ల పిల్లల జీవితాలు బాగుంటాయని పదే పదే మాకు చెబుతూ బాగా చదవాలని ప్రోత్సహించారు. ఆయన మార్గదర్శకంలోనే నేను ఈ ఉద్యోగం సాధించగలిగాను. మా చెల్లి వైద్యురాలిగా స్థిరపడింది. మా అన్నయ్య ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇలా కుటుంబంలో ఉన్న ముగ్గురం ఉన్నత స్థాయికి చేరుకోవడం వెనుక మా తండ్రి కష్టం ఎంతో దాగి ఉంది.
ఆదివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2026


