కందనూలు: మండలంలోని నందివడ్డేమాన్‌లో వెలసిన శనేశ్వరస్వామికి భక్తులచే శని గ్రహదోష నివారణ కోసం స్వామివారికి తిలతైలాభిషేకాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి మాట్లాడుతూ ఈ మాసంలో స్వామివారిని కొలిచిన అత్యధికులు సంతృప్తి పొంది విశేష ఫలితాన్ని పొందుతారని పేర్కొన్నారు. అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోపాల్‌రావు, సర్పంచ్ సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.
రాజకీయాల కోసం
అధికారులను బలిచేయొద్దు
కొల్లాపూర్: అధికార పార్టీ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వ అధికారులను బలి చేయొద్దని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎండీ ఫయాజ్ అన్నారు. శనివారం ఆయన కొల్లాపూర్‌లో విలేకరులతో మాట్లాడారు. కొంతకాలంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో రెవెన్యూ, పోలీసు అధికారుల బదిలీలు అనూహ్య రీతిలో జరుగుతున్నాయని ఆరోపించారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ల కారణంగానే అధికారులు కొల్లాపూర్ నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లిపోతున్నారని, కొల్లాపూర్‌కు వచ్చేందుకు అధికారులు భయపడే పరిస్థితులు రావడం బాధాకరమన్నారు. ఈ అంశాలను పాలకులు, ఉన్నతాధికారులు నిశితంగా పరిశీలించాలని కోరారు. ప్రభుత్వ కార్యాలయాలను రాజకీయ కేంద్రాలుగా మార్చొద్దన్నారు. ఇవే పద్ధతులు కొనసాగితే సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో ఇందిర, శివుడు, యూసుఫ్, కిరణ్‌కుమార్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపు
కందనూలు: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల విద్యను నిర్వీర్యం చేస్తూ విద్యా వ్యతిరేక విధానాలకు నిరసనగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ఏబీవీపీ జిల్లా కార్యదర్శి శాంతన్ తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రేషనలైజేషన్ పేరుతో వేలాది ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. పాఠశాలలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రోత్సాహం అందిస్తూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను దూరం చేసే విధానాలను అవలంభిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత, ఉపాధ్యాయుల ఖాళీలు, పర్యవేక్షణ లోపాలు కొనసాగుతున్నాయని, ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్–టీచింగ్, ఎంఈఓ, సంబంధిత పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాలలకు శాశ్వత భవనాలు నిర్మించి, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం నిర్వహించే రాష్ట్రవ్యాప్త పాఠశాలల బంద్‌ను విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాభిమానులు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి ప్రసాద్ కుమార్, నగర సంయుక్త కార్యదర్శి శివ తదితరులు పాల్గొన్నారు.
నీట్ అభ్యర్థులకు
ఉచిత బస్సు సౌకర్యం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఆర్టీసీ ఎండీ ఆదేశాల మేరకు ఈనెల 21న నీట్ రీ–ఎగ్జామ్ అభ్యర్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని ఆర్‌ఎం సంతోష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు బస్సు ఎక్కేముందు కండక్టర్ లేదా డ్రైవర్‌కు తమ హాల్‌టికెట్ చూపిస్తే సరిపోతుందన్నారు. ఈ సదుపాయం మహబూబ్‌నగర్ రీజియన్ పరిధిలోని ఏసీ సహా అన్ని బస్సు సర్వీసులకు వర్తిస్తుందని తెలిపారు. ఆయా మార్గాలలో అదనపు బస్సులు నడుపుతామని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అని డిపోల మేనేజర్లను ఆదేశించామని పేర్కొన్నారు. ఏమైనా సమస్యలు ఎదురైతే టీజీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040–2345 0033, 6815 3333, 99592 26295, 99592 26296లకు సంప్రదించవచ్చని సూచించారు.


