పథకాల అమలులో జాప్యం వద్దు | - | Sakshi
Sakshi News home page

పథకాల అమలులో జాప్యం వద్దు

Apr 25 2026 9:30 AM | Updated on Apr 25 2026 9:30 AM

కందనూలు: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో జాప్యానికి తావులేకుండా ప్రజలకు అందేలా చూడాలని ఎంపీ, జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ (దిశ) కమిటీ చైర్మన్‌ మల్లు రవి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన దిశా సమావేశానికి నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, కల్వకుర్తి ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్లు అమరేందర్‌, శ్యాంప్రసాద్‌లాల్‌, జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్‌చంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల అమలులో బ్యాంకుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ (పీఎంఈజీపీ) పథకం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంత యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని, ఇందులో ప్రతి బ్యాంకు తమ పరిధిలో ఉన్న లబ్ధిదారులకు ఎంఎస్‌ఎంఈలకు ప్రాధాన్యతనిస్తూ రుణాల మంజూరులో వేగం పెంచాలన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తుందన్నారు. పీఎం విశ్వకర్మ పథకం కింద అర్హులైన వారికి తక్షణమే రుణాలు అందించాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద ఆమోదం పొందిన రుణ దరఖాస్తులకు ఆశించిన స్థాయిలో రుణాలు అందించకపోవడంపై ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల దరఖాస్తులను వెంటనే పరిష్కరించి, లబ్ధిదారులు తమ వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని బ్యాంక్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. బ్యాంకర్లు కేవలం రుణాల మంజూరుకు మాత్రమే పరిమితం కాకుండా, లబ్ధిదారులకు మార్గదర్శకత్వం కూడా అందించాలని సూచించారు. వ్యాపార ప్రణాళికలు రూపొందించడం, రుణ వినియోగం, తిరిగి చెల్లింపు విధానాలపై అవగాహన కల్పించడం ద్వారా స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించవచ్చన్నారు.

పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు

పాఠశాల విద్య, ఇంటర్మీడియట్‌, కస్తూరా్భా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల నిర్వహణ, విద్యార్థుల హాజరు, ఫలితాలు, మౌలిక సదుపాయాలపై ఎంపీ సమీక్షించారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడంతోపాటు, వసతి, ఆహారం, భద్రత వంటి అంశాల్లో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల వసతి గృహాలపై కూడా ప్రత్యేకంగా చర్చిస్తూ.. అక్కడి పరిస్థితులను తరచుగా పర్యవేక్షించాలని చెప్పారు. సంక్షేమ పథకాల అమలుపై సమీక్షిస్తూ ఎస్సీ, బీసీ కార్పొరేషన్‌, మైనార్టీ సంక్షేమ శాఖల పనితీరును పరిశీలించారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాల ప్రయోజనాలు పారదర్శకంగా, సమయానికి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పీఎంఈజీపీ ద్వారా యువతకు స్వయంఉపాధి అవకాశాలు

బ్యాంకర్లు రుణాల మంజూరులో వేగం పెంచాలి

శాఖల మధ్య సమన్వయం పెంపొందించుకోవాలి

దిశ కమిటీ చైర్మన్‌, ఎంపీ మల్లురవి

Advertisement
 
Advertisement
Advertisement