నాగర్‌కర్నూల్ రూరల్: సమగ్ర సాంస్కృతిక విధానం రూపొందించి కళారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల్‌నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో కళాకారులది ముఖ్య పాత్ర అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కళాకారులను అన్ని విధాలుగా ఆదుకుంటామని గత ప్రభుత్వం హామీ ఇచ్చి నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం కళాకారులకు ఉద్యోగ, ఉపాధి, అవకాశాలు కల్పిస్తామని చెప్పి రెండేళ్లు గడిచినా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని దుయ్యబట్టారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌కు అందజేశారు. కార్యక్రమంలో ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు మల్లయ్య, కార్యదర్శి విజయుడు, కళాకారులు పర్వతాలు, చందు, యాదగిరి, ఊషన్నగౌడ్, నాగరాజు, జ్యోతి, వెంకటస్వామి, సువర్ణ, నర్సింహ, శివకృష్ణ పాల్గొన్నారు.


