కందనూలు: జిల్లాలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రెవెన్యూ, సాగునీటి శాఖల అధికారులతో కలిసి భూసేకరణ పనుల పురోగతిపై కలెక్టర్ సమగ్రంగా చర్చించారు. జిల్లాలో అమలులో ఉన్న ప్రాధాన్య ప్రాజెక్టులైన పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలు, మహాత్మగాంధీ కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గంలోని ఇతర సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణ పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రైతుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని పారదర్శకంగా, న్యాయబద్ధంగా భూసేకరణ ప్రక్రియ కొనసాగించాలని సూచించారు. భూ యజమానులతో సమన్వయం చేసుకుని, వారికి చెల్లించాల్సిన పరిహారం విషయంలో ఎ లాంటి ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. భూ సేకరణకు సంబంధించిన పెండింగ్ కేసులు, వివాదాలు, సర్వే ప్రక్రియలు త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రతి దశలో సమన్వయం పెంచుకుని నిర్ణీత గడువులో పనులు ముగించాలని పేర్కొన్నారు. అవసరమైతే ప్రత్యేక శిబిరాలు నిర్వహించి రైతుల సందేహాలను నివృత్తి చేయాలని, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అమరేందర్, సాగునీటి శాఖల అధికారులు పాల్గొన్నారు.


