మిగిలింది 2 రోజులే.. | - | Sakshi
Sakshi News home page

మిగిలింది 2 రోజులే..

Feb 8 2026 7:34 AM | Updated on Feb 8 2026 7:34 AM

మిగిలింది 2 రోజులే..

మిగిలింది 2 రోజులే..

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి సమీపిస్తున్న గడువు

మొదలైన ప్రలోభాల పర్వం..

సాక్షి, నాగర్‌కర్నూల్‌: మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు రోజుల సమయమే మిగిలి ఉంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ నెల 11న మున్సిపల్‌ ఎన్నికలను నిర్వహించనుండగా.. అంతకు 48 గంటల ముందే ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈ క్రమంలో ప్రచారానికి తక్కువ సమయమే ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్‌ మొదలైంది. దీంతో ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా క్షణం తీరిక లేకుండా రోజంతా ప్రచారంలో నిమగ్నమవుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు.

ప్రధాన పార్టీల ప్రచారంలో వేగం..

ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రచారంలో వేగం పెంచాయి. ఉదయం నుంచే ప్రచార రథాలు, మైక్‌లతో హోరెత్తిస్తున్నాయి. వార్డుల వారీగా అభ్యర్థుల ప్రత్యేక పాటలతో రోజంతా ప్రచారం సాగిస్తున్నారు. కాంగ్రెస్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీ వార్డుల్లో కలియదిరుగుతున్నారు. వారితోపాటు సతీమణులు, కుటుంబసభ్యులు సైతం ప్రచారంలో పాలుపంచుకుంటున్నారు. మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి లలిత సైతం ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు తనయుడు అరుణ్‌ కొల్లాపూర్‌ మున్సిపాలిటీలో అన్నీతానై వ్యవహరిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు తీరిక లేకుండా ప్రచారంలోనే నిమగ్నమవుతున్నారు. తమకు కలిసివచ్చే అంశాలపై దృష్టిపెడుతూ ఓట్ల సమీకరణకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ సైతం తమకు పట్టున్న ప్రాంతాలపై ఫోకస్‌ను మరింత పెంచింది. అభ్యర్థులతోపాటు నేతలు ఉదయం నుంచి సాయంత్రం వ రకు వార్డుల్లో ప్రచారం నిర్వహిస్తూ రాత్రివేళల్లోనూ అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాలకు పదునుపెడుతున్నారు.

బలప్రదర్శనపై ఫోకస్‌..

ఇప్పటివరకు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ వచ్చిన పార్టీలు ఎన్నికల ప్రచారంలో క్రమంగా వేగం పెంచుతున్నాయి. ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు రోజులే మిగిలి ఉండటంతో తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను ఆకర్షించేందుకు బల ప్రదర్శనపై దృష్టిపెట్టాయి. ఎక్కువ మంది మహిళలు, యువత, పెద్ద సంఖ్యలో ప్రజలను తమ వెంట ప్రచారంలో తిప్పుకొనేందుకు అధికంగా ఖర్చు చేస్తున్నాయి. ప్రచార ర్యాలీల్లో బల ప్రదర్శన చూపించడం ద్వారా తటస్థ ఓటర్లను తమ వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. గంపగుత్తగా ఓట్లను పొందేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.

వలస ఓట్ల కోసం గాలింపు..

మ్మడి జిల్లాలో వలస ఓటర్ల ప్రభావం ఎక్కువ ఉండటంతో మున్సిపల్‌ ఎన్నికల్లో వారి ఓట్ల కోసం అన్ని పార్టీల గాలింపు కొనసాగుతోంది. హైదరాబాద్‌, ఇతర ప్రాంతాల్లో నివశిస్తున్న ఓటర్లను గుర్తించడంతోపాటు వారి నివాస స్థలాలు, ఫోన్‌ నంబర్లను సేకరిస్తున్నారు. వారందరినీ పోలింగ్‌ రోజున స్వస్థలాలకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వారి బాధ్యతలు, బాగోగులను సంబంధిత వార్డుల్లో ఇన్‌చార్జిలకు అప్పగిస్తున్నారు. వలస ఓటర్లకు సంబంధించి వారి ప్రయాణ ఖర్చులతోపాటు ఓటుకు కనీసం రూ.2 వేల చొప్పున ముట్టజెప్పేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మిగతా ఓటర్ల కన్నా ముందస్తుగానే వలస ఓటర్లకు సర్దుబాటు చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి.

ప్రధాన పార్టీల మధ్య ప్రచార జోరు

సమయం దగ్గరపడుతున్న కొద్దీ

అభ్యర్థుల్లో మొదలైన టెన్షన్‌

బలప్రదర్శనతో హోరెత్తిస్తున్న పార్టీలు

మున్సిపల్‌ పోలింగ్‌కు మూడు రోజుల ముందే పట్టణాల్లో ఓట్ల కోసం ప్రలోభాల పర్వం మొదలైంది. ఇప్పటికే వార్డుల్లో మద్యం ఏరులై పారుతోంది. నిత్యం ప్రచారంలో పాల్గొంటున్న వారితోపాటు వార్లుల్లో ఇంటింటికి మద్యం బాటిల్‌ పంపిణీ సైతం ఇప్పటికే మొదలైంది. కుల, మహిళా సంఘాల్లోని సభ్యుల ఓట్లను గంపగుత్తగా పొందేందుకు అభ్యర్థులు ఎవరికి వారు తాయిళాలు ప్రకటిస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికలకు గడువు ముంచుకొస్తుండటంతో ప్రలోభాల పర్వం మరింత ఊపందుకోనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement