నిబంధనలు పక్కాగా పాటించాలి
కందనూలు: ఎన్నికల నిబంధనలను పక్కాగా పాటిస్తూ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, సజావుగా చేపట్టాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లాలోని నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీలలో ఈ నెల 13న నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియపై శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పీఓలు, ఏపీఓలు, ఇతర అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపులో పాటించాల్సిన నిబంధనలు, అనుసరించాల్సిన విధానాలపై అధికారులకు అవగాహన కల్పించారు. బ్యాలెట్ పత్రాల ఓట్ల లెక్కింపు విధానం, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియపై మాస్టర్ ట్రైనర్ గోపాల్‌నాయక్ శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్ సిబ్బంది అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వార్డుల వారీగా ఓట్ల లెక్కింపు పకడ్బందీగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఓట్ల లెక్కింపు రోజున ఉదయం 6 గంటలకల్లా సిబ్బంది కౌంటింగ్ కేంద్రాలకు చేరుకొని.. టేబుళ్ల వద్ద పోటీ చేస్తున్న అభ్యర్థుల పార్టీల గుర్తుల ప్రకారం బాక్సులు సిద్ధం చేసుకోవాలన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభించి.. అనంతరం పోలింగ్ కేంద్రాలు, వార్డుల వారీగా బ్యాలెట్ బాక్సులను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఓపెన్ చేయాలని సూచించారు. చెల్లని ఓట్లను గుర్తించి ప్రకటించే పూర్తి బాధ్యత రిటర్నింగ్ అధికారులదేనని స్పష్టం చేశారు. శిక్షణ తరగతుల్లో అదనపు కలెక్టర్ దేవసహాయం, డిప్యూటీ సీఈఓ గోపాల్‌నాయక్ పాల్గొన్నారు.


