సరైన సమయానికి టీకాలు ఇవ్వాలి
బిజినేపల్లి/ తిమ్మాజిపేట: ప్రతి చిన్నారికి సరైన సమయానికి టీకాలు ఇవ్వాలని, డ్యూలిస్ట్ ఉన్న చిన్నారులకు తక్షణమే టీకాలు అందించి పూర్తిచేయాలని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి సురేష్‌బాబు అన్నారు. శనివారం ఆయన స్థానిక పీహెచ్‌సీని సందర్శించి.. టీకా రికార్డులు, నిల్వలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తున్న రొటీన్ టీకా సేవల అమలు తీరు, లబ్ధిదారుల వివరాల నమోదు, పెండింగ్ డ్యూ కేసులు, గుర్తింపు తదితర అంశాలను సమీక్షించారు. టీకా రికార్డుల నిర్వహణ, ఆన్‌లైన్ నమోదులో నిర్లక్ష్యం చేయరాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఓ చారి, జిల్లా వ్యాక్సిన్ స్టోర్ మేనేజర్ దివ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం తిమ్మాజిజేట మండలంలోని గుమ్మకొండ ఆరోగ్య ఉపకేంద్రం, తిమ్మాజిపేటలోని పీహెచ్‌సీని సందర్శించి వ్యాక్సిన్ రికార్డులు, డ్యూలిస్టు జాబితాను పరిశీలించారు. ఆయన వెంట ఏపీఓ చారి, జిల్లా వ్యాక్సిన్ స్టోర్ మేనేజర్ కుమార్, డాక్టర్ ఇస్మాయిల్ తదితరులున్నారు.
ఇంటర్ ప్రాక్టికల్స్‌కు
82 మంది గైర్హాజరు
కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. శనివారం 33 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా.. 2,000 మంది విద్యార్థులకు గాను 1,918 మంది హాజరుకాగా.. 82 మంది గైర్హాజరయ్యారు. ప్రాక్టికల్స్ సందర్భంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని డీఐఈఓ వెంకటరమణ తెలిపారు.
ప్రశాంతంగా నవోదయ ప్రవేశ అర్హత పరీక్ష
కందనూలు/ బిజినేపల్లి: వట్టెం జవహార్ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం శనివారం నిర్వహించిన ప్రవేశ అర్హత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 9వ తరగతిలో ప్రవేశాల కోసం 1,520 విద్యార్థులకు గాను 1,067 విద్యార్థులు హాజరు కాగా.. 11వ తరగతి కోసం 3,072 మంది విద్యార్థులకు గాను 2,353 మంది పరీక్షకు హాజరయ్యారని నవోదయ ప్రిన్సిపల్ భాస్కర్‌కుమార్ తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.
సరైన సమయానికి టీకాలు ఇవ్వాలి


