ఉపాధి పనుల్లో కూలీల సంఖ్య పెంచాలి
లింగాల: ఉపాధి పనుల్లో కూలీల సంఖ్య పెంచుతూ వారికి జీవనోపాధి కల్పించాలని అదనపు డీఆర్‌డీఓ రాజేశ్వరి అన్నారు. శనివారం ఆమె మండలంలోని లింగాల, జీల్గుపల్లిలో పర్యటించి.. ఉపాధి పథకంలో చేపట్టిన వివిధ పనులను పరిశీలించారు. వ్యవసాయ పనులు ముగుస్తున్న ఈ సమయంలో కూలీలకు పనులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి కూలీకి పనులు కల్పించాలని చెప్పారు. పనుల్లో పారదర్శకత ఉండాలని, నిబంధనల మేరకు పనులు చేపట్టాలని సూచించారు. ప్రతి పంచాయతీ పరిధిలోని నర్సరీలలో మొక్కల పెంపకం చేపట్టాలని, నర్సరీల పెంపకంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని చెప్పారు. ఇప్పటికే నాటిన మొక్కల చుట్టూ కంచెలను ఏర్పాటు చేసి కాపాడాలని కోరారు. అలాగే ఉపాధి పథకంలో చేపట్టిన కోళ్ల పెంపకం, నర్సరీలు, మొక్కల చుట్టూ కంచె ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో ఏపీఓ ఇమాంఅలీ, టీఏలు శివకుమార్, పార్వతి తదితరులు పాల్గొన్నారు.


