పెద్ద పులులు.. వన్యప్రాణులు
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో అటవీ అధికారులు టైగర్ సఫారీ ద్వారా పెద్ద పులులు, చిరుతలు, ఇతర వన్యప్రాణులు, అడవి అందాలను వీక్షించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. నల్లమలలో 34 వరకు పెద్ద పులులు, వందకుపైగా చిరుతలు, ఎలుగుబంట్లు, వందల సంఖ్యలో జింకలు, దుప్పులు, మనుబోతులు, అడవి పందులు, అడవి కుక్కలు తదితర వన్యప్రాణులు ఉన్నాయి. టైగర్ సఫారీ వాహనంలో ప్రయాణించే సందర్శకులకు తరచుగా వన్యప్రాణులు కనిపిస్తున్నాయి. ఇటీవల 20 రోజుల వ్యవధిలోనే సందర్శకులకు మూడుసార్లు పెద్ద పులులు కనిపించాయి. ఎలుగుబంట్లు, జింకలు, మనుబోతులు ఇక్కడికి వస్తున్న సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. నల్లమలను సందర్శించాలనుకునే పర్యాటకులు అటవీశాఖ టైగర్ స్టే ప్యాకేజీతోపాటు జంగిల్ సఫారీ ట్రిప్‌ను అందిస్తోంది. సఫారీ వాహనంలో ప్రయాణించాలనుకునే సందర్శకులు హైదరాబాద్– శ్రీశైలం రహదారిలో ఉన్న ఫర్హాబాద్ గేటు వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది.


