రిజర్వేషన్.. ఏమొస్తదో
మున్సిపాలిటీ ఎన్నికలపై జోరుగా చర్చ
● వార్డుకు ఐదారుగురి పేర్లు పరిశీలిస్తున్న పార్టీలు
● జనరల్ స్థానాలపై సీనియర్ నేతల ప్రత్యేక దృష్టి
● రిజర్వేషన్, నామినేషన్ల మధ్య
రెండు, మూడు రోజులే సమయం
● జిల్లాలోని మూడు పురపాలికల్లో రాజకీయ సందడి
అచ్చంపేట: పుర పోరు ముంచుకొస్తున్న తరుణంలో జిల్లాలో అందరి నోటా రిజర్వేషన్ల మాటే వినిపిస్తోంది. వార్డులు, చైర్మన్ పదవులకు రిజర్వేషన్ ఏం వస్తదో అనే ఆలోచనల్లో ఆశావహులు ఉన్నారు. ఎవరికి వారు రిజర్వేషన్లు మారి చైర్మన్ గిరి దక్కే అవకాశం ఉందంటూ జోస్యం చెబుతున్నారు. అన్ని పార్టీలు రిజర్వేషన్ ఏది వచ్చినా అందుకు తగ్గట్లుగానే ముందే ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇప్పటికే 3 మున్సిపాలిటీల పరిధిలోని 65 వార్డుల వారీగా ఓటర్ల జాబితాను అధికారులు ప్రకటించారు. దీంతో పోటీలో నిలవాలని అనుకుంటున్న ఆశావహులు మున్సిపాలిటీకి కట్టే పన్నులను చెల్లించే పనిలో నిమగ్నమయ్యారు.
పోటీకి ఆసక్తి..
జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉండగా అచ్చంపేట మున్సిపాలిటీకి మే 6 వరకు సమయం ఉండటంతో నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తిలపైనే అందరి దృష్టి ఉంది. ఆశావహులు అందరూ రిజర్వేషన్ల కోసం ఉత్కంఠగా ఎదరుచూస్తున్నారు. రిజర్వేషన్ తేలితేనే పోటీపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. రిజర్వేషన్ వెల్లడించిన తర్వాత నామినేషన్‌కు మధ్యలో సమయం పెద్దగా ఉండకపోవచ్చని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఓటర్ల జాబితా తయారీ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 16 వరకు తుది జాబితా ప్రదర్శించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశించింది. ఈ నెల 17న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉండటంతో ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియకు సంబంధించి మార్గదర్శకాలు ఆలోగా పూర్తి చేయవచ్చని భావిస్తున్నారు.
చైర్మన్ సీటుపై గురి
నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ స్థానాలను ఏ సామాజిక వర్గాలకు రిజర్వు చేస్తారనే చర్చ సాగుతోంది. రాష్ట్రస్థాయిలో మున్సిపాలిటీల సంఖ్య ఆధారంగా ఓటర్ల సంఖ్యను పరిగణలోకి తీసుకుని మన్సిపల్ చైర్మన్ స్థానాలకు రిజర్వేషన్ కల్పిస్తారు. వార్డులకు కలెక్టర్ అధ్యక్షత రిజర్వేషన్లు ఖరారవుతాయి. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ జనరల్ మహిళకు కేటాయిస్తే బీసీ మహిళను చైర్‌పర్సన్‌గా ఎంపిక చేశారు. కొల్లాపూర్ బీసీ మహిళ, కల్వకుర్తి, అచ్చంపేట జనరల్‌కు కేటాయించారు. అచ్చంపేటలో బీసీ జనరల్‌ను చైర్మన్‌గా కూర్చోబెట్టారు. అయితే అవిశ్వాస తీర్మానంతో ఇక్కడ తిరిగి జనరల్ వ్యక్తిని చైర్మన్‌గా కుర్చీ చేపట్టారు. ఈసారి కలిసొస్తే వార్డు కౌన్సిలర్లుగా గెలిచి చైర్మన్ సీటుపై కూర్చోవాలని పలువురు దృష్టి సారించారు. ఈ మేరకు పార్టీల మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు. వార్డుల రిజర్వేషన్లు కూడా ఇప్పటికే రెండు పర్యాయాలు ఒకే సామాజిక వర్గాలకు చెందిన వారు ఎంపికవడంతో ఈసారి మార్పు తథ్యమని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వార్డుల రిజర్వేషన్లపై కూడా ఉత్కంఠ నెలకొంది.
జంపింగ్‌లకు చెక్ పెట్టేలా..
రిజర్వేషన్ల కేటాయింపు నామినేషన్లకు మధ్య తక్కువ సమయం ఉండటం అసంతృప్తి నాయకులు ఇతర పార్టీల్లోకి వెళ్లే అవకాశాలకు చెక్‌పెట్టే విధంగా కలిసి వచ్చింది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో వార్డుకు ముగ్గురు, నలుగురు చొప్పున టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ టికెట్ రాకపోతే బీజేపీ, బీఆర్‌ఎస్, ఇతర పార్టీలను ఆశ్రయించే అవకాశం ఉంది. మిగతా పార్టీలు కూడా ఇతర నాయకులను చేర్చుకుని బలపడే ఆలోచనలో ఉన్నాయి.


