అడవిని నరికిన వారిపై చర్యలు తీసుకోవాలి
కొల్లాపూర్: మండలంలోని ఎల్లూరు సమీపంలో అడవిని నరికి గుట్టలను చదును చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.బాల్‌నర్సింహ్మ డిమాండ్ చేశారు. ఎల్లూరు శివారులోని సర్వేనంబర్ 359, 360, 364, 365లో గల 45 ఎకరాల భూమిని సురభి రాజవంశ వారసుడు ఆదిత్య లక్ష్మారావు, ఆయన సోదరి హైదరాబాద్‌కు చెందిన వారికి కొన్ని నెలల క్రితం విక్రయించారు. ఈ భూమి స్వాతంత్య్రం రాక పూర్వం నుంచి కూడా అడవిగానే ఉండేది. ఈ భూమిని ఇటీవలే కొందరు కొనుగోలు చేసి చెట్లన్నీ నరికేశారు. గుట్టలను చదునుచేసి.. లోయలను పూడ్చివేస్తున్నారు. దీనిపై స్థానిక రైతులు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్న నేపథ్యంలో సీపీఐ బృందం ఆ భూమిని పరిశీలించింది. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బాల్‌నర్సింహతో పాటు జిల్లా కార్యదర్శి ఫయాజ్ విలేకర్లతో మాట్లాడారు. 1995 వరకు సర్కారీ ఇనాంగా రికార్డుల్లో నమోదైన భూమి.. ఆ తర్వాతి కాలంలో సురభి రాజవంశస్థుల పేరిట పట్టా భూమిగా ఎలా మారిందో అధికారులు చెప్పాలన్నారు. ఫారెస్టు, వాల్టా చట్టాలను తుంగలో తొక్కుతూ అడవిని నరికేస్తున్నా అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదన్నారు. సామాన్యులు ఎక్కడైనా కొన్ని చెట్లు నరికితే కేసులు పెట్టే అటవీ అధికారులు.. కొల్లాపూర్‌కు అతి సమీపంలోని అడవిని నరికేస్తే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించాలని వారు కోరారు. రాజ కుటుంబీకులకు సీలింగ్ యాక్టును వర్తింపజేయాలన్నారు. సదరు భూమిని తిరిగి ఫారెస్టుకు అప్పగించాలని.. లేదంటే పేదలకు పంచాలని వారు కోరారు. సమావేశంలో సీపీఐ నాయకులు ఏసయ్య, ఇందిరమ్మ, తుమ్మల శివుడు, వెంకటయ్య, ఆనంద్, ప్రకాశ్, కురుమయ్య ఉన్నారు.


