
ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలి
కల్వకుర్తి రూరల్: దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న అసమానతలు, కార్మికులపై దాడులు, రైతుల దోపిడీ, నిరుద్యోగం వంటి సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రజా పోరాటాలే శరణ్యం అని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. కల్వకుర్తిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో సీపీఐ జిల్లా మహాసభలు జిల్లా కార్యదర్శి బాల్‌నర్సింహ అధ్యక్షతన శనివారం రెండోరోజు కొనసాగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్ర జెండా పేదలకు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. దేశంలో కొంతమంది చేతిలోనే రూ.కోట్ల సంపద ఉండిపోయిందని దుయ్యబట్టారు. అసమానతలు, అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు ఎరజ్రెండా నీడన పోరుబాటకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. వామపక్ష శక్తులుగా, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాటం సాగించే పార్టీగా సీపీఐ అగ్రభాగాన ఉందన్నారు. ప్రతి ఒక్కరూ సామాన్య ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడేందుకు కలిసిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు ఆనంద్‌జి, ఫయాజ్, కేశవులుగౌడ్, అనిల్‌కుమార్, నర్సింహ, విజయుడు, ఇందిరమ్మ, చంద్రమౌళి, భరత్, పరశురాములు, శీను తదితరులు పాల్గొన్నారు.