
నిర్లక్ష్యం నిండా ముంచేస్తోంది!
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో కృష్ణానది పరివాహక ప్రాంతాలు, వాగులు, వంక ల్లో నీటి ఉధృతి రోజురోజుకూ పెరుగుతోంది. వర్షా లతో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్‌రఘునాథ్ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నప్పటికీ కొంద రు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వర్షాలతో నాగర్‌కర్నూ ల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట ప్రాంతాల వాగుల్లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వా టిని దాటేందుకు ప్రయత్నిస్తూ ప్రజలుప్రమాదాల బారిన పడుతున్నారు. ఇటీవల కల్వకుర్తి మండలంలో దుందుభీ నది వాగు దాటేందుకు ప్రయత్నిస్తూ వ్యక్తి మృత్యువాత పడిన ఘటన చోటుచేసుకుంది.
పట్టించుకోని వాహనదారులు
వాగుల్లో నీటి ఉధృతి ఎక్కువగా ఉన్నపుడు వాహనదారులు వాటి దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, నీటి ప్రవాహం మరి ఎక్కువగా ఉన్నపుడు నదులు, వాగులు దాటొద్దని అఽధికారులు సూచిస్తున్నప్పటికీ కొందరు వాహనదారులు నిర్లక్ష్యంగా ప్రయాణిస్తూ ప్రాణాలు పణంగా పెడుతున్నారు.
పోలీసు నిఘా పెంచాలి
ప్రస్తుతం ఎగువన కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని సోమశిల, మంచాలకట్ట, అమరగిరి ప్రాంతాల్లో కృష్ణానది నిండుకుండలా మారింది. శ్రీశైలం ఆనకట్ట గేట్లు ఎత్తి దిగువనకు నీటిని వదులుతుండటంతో నదితీర అందాలను చూసేందుకు పర్యాటకులు పెద్దసంఖ్యలో వస్తున్నారు. శని, ఆదివారాల్లో శ్రీశైలం దర్శనానికి వెళ్లే భక్తులతో పాటు పర్యాటకులు వస్తుండటంతో వాహనాలను శ్రీశైలం డ్యాం వద్ద పార్కింగ్ చేస్తుండటంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు నిఘాను పెంచాలని పలువురు కోరుతున్నారు. సోమశిల, మల్లేశ్వరం, మంచాలకట్ట, అమరగిరి నదితీర ప్రాంతాల్లో నీటి ప్రవాహంలో పర్యాటకులు సెల్ఫీ మోజులో, మర పడవల్లో ప్రమాదకర ప్రయాణం చేస్తూ ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు.
వర్షాలతో పొంగిపొర్లుతున్న
వాగులు, వంకలు
ఇటీవల దుందుభీ నది దాటుతూవ్యక్తి మృతి
నదీతీర ప్రాంతాల్లో అప్రమత్తంగాఉండాలంటున్న పోలీసులు