జనరల్ ఆస్పత్రి వద్ద ప్రైవేట్ అంబులెన్స్ వాహనదారుల ఇష్టారాజ్యం
●
● అత్యవసర పరిస్థితుల్లో ఇతర ప్రాంతాలకు
వెళ్లాలంటే రూ.వేలు చెల్లించాల్సిందే
● సిండికేట్‌గా మారి
నిలువుదోపిడీకి యత్నం
● అప్‌గ్రేడ్ అయినా అందుబాటులోకి
రాని ఉచిత అంబులెన్స్ సేవలు
ఉచిత సేవలు కల్పిస్తాం..
జనరల్ ఆస్పత్రి నుంచి అత్యవసర సమయంలో రెఫర్ అయ్యే బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తాం. అలాగే ఆస్పత్రిలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, సెక్యూరిటీ సిబ్బంది ప్రైవేటు అంబులెన్స్‌లను ఏర్పాటు చేసుకుని రోగులను తరలిస్తున్నారనే విషయం మా దృష్టికి వచ్చింది. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. – ఉషారాణి,
జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్
వాటిని సీజ్ చేస్తాం..
జిల్లాలోని ప్రైవేటు అంబులెన్సులకు సరైన పత్రాలు లేకపోవడంతోపాటు ఫిట్‌నెస్ లేని వాహనాలను రోడ్లపైకి తీసుకువస్తే సీజ్ చేస్తాం. జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో త్వరలోనే జిల్లాలోని ప్రైవేటు అంబులెన్స్‌లను తనిఖీ చేస్తాం. మోటారు వాహన నిబంధనలను పాటించని అంబులెన్సులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
– చిన్న బాలు, జిల్లా రవాణా శాఖాధికారి
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లా జనరల్ ఆస్పత్రి వద్ద ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకుల ఆగడాలు మితిమీరుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులు, రోడ్డు ప్రమాద బాధితులను ఇతర ప్రాంతాలకు తరలించాలంటే ప్రైవేటు అంబులెన్స్‌ల యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ బాధితుల నుంచి రూ.వేలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా ఏర్పాటు తర్వాత జిల్లా ఆస్పత్రిగా, మెడికల్ కళాశాల రాకతో జనరల్ ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ అయినా ఉచిత అంబులెన్స్ సేవలు అందుబాటులో లేకపోవడంతో నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జనరల్ ఆస్పత్రిలో ఒకే ఉచిత అంబులెన్స్ ఉండటంతో అందరికీ సేవలు అందలేకపోతున్నాయి.
సిండికేటుగా మారి..
జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల నుంచి జనరల్ ఆస్పత్రికి ప్రతిరోజు 800 మంది వరకు వస్తుంటారు. అయితే రోడ్డు ప్రమాద బాధితులను మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్, హైదరాబాద్‌కు రెఫర్ చేస్తుండటంతో ప్రైవేటు అంబులెన్స్‌లను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో ప్రైవేటు అంబులెన్స్‌ల యజమానులు సిండికేటుగా మారి బాధితుల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటు అంబులెన్స్‌ల సిండికేట్‌లో భాగంగా ప్రతిరోజు కొన్నింటికి మాత్రమే అవకాశం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు ఎవరైనా తమను ఆశ్రయిస్తే వారు నిర్ణయించిన రేటుకే వెళ్లాలి.. లేదంటే మరో అంబులెన్స్ రాదు. ఈ క్రమంలోనే ప్రైవేటు అంబులెన్సులో మహబూబ్‌నగర్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లాలంటే రూ.4 వేలు, హైదరాబాద్‌కు అయితే రూ.6 వేల వరకు వసూలు చేస్తున్నారు. కాగా.. ఎవరైనా చికిత్సకు తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యంలో మృతిచెందితే అదనంగా మరో రూ.4 వేలు వసూలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు.
ఔట్‌సోర్సింగ్, సెక్యూరిటీ సిబ్బంది..
జనరల్ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్, సెక్యూరిటీ సిబ్బంది ప్రైవేటు అంబులెన్సులను ఏర్పాటు చేసుకుని అత్యవసర పరిస్థితుల్లో రెఫర్ చేసే వారిని తమ అంబులెన్స్‌లలో తరలిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నారు. దీంతోపాటు చాలారోజులుగా అంబులెన్స్‌ల దందాపై అధికారులకు సమాచారం ఉన్నా వివిధ వర్గాల ఒత్తిళ్లతో అటువైపు చూడటం లేదు.
నిబంధనలు పాటించట్లే..
ప్రాణాపాయస్థితిలో ఉన్న క్షతగాత్రులు, రోగుల కుటుంబ సభ్యులతో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్న ప్రైవేటు అంబులెన్సుల యజమానులు మోటారు వాహన చట్టాల నిబంధనలు పాటించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. క్షతగాత్రులను తరలించే క్రమంలో అంబులెన్సులను ఎవరు ఆపరనే ఆలోచనతో సరైన పత్రాలు లేకపోవడంతోపాటు ఫిట్‌నెస్ పరీక్షలు చేయించడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో జిల్లా రవాణా శాఖ అధికారులు వీటిపై దృష్టిసారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
దోపిడీని అరికట్టాలి..
జనరల్ ఆస్పత్రిలో ప్రైవేటు అంబులెన్స్‌లు ఇష్టారీతిగా వ్యవహరిస్తూ అత్యవసర పరిస్థితిలో ఉన్నవారి నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. అలాగే ఇక్కడ మృతిచెందిన వారి మృతదేహాలను సమీప గ్రామాలకు తీసుకువెళ్లాలన్నా రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారు. జనరల్ ఆస్పత్రిలో ఉచిత అంబులెన్సు సేవలు ప్రారంభించి సామాన్య ప్రజలకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలి.
– నజీర్, నాగర్‌కర్నూల్
ఆగడాలకు అడ్డుకట్ట పడేనా?
ఆగడాలకు అడ్డుకట్ట పడేనా?
ఆగడాలకు అడ్డుకట్ట పడేనా?
ఆగడాలకు అడ్డుకట్ట పడేనా?