
పాఠశాలల్లో బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం
నాగర్‌కర్నూల్: కంప్యూటర్ ఆధారిత విద్యకు రాన్రాను ప్రాధాన్యత పెరగుతుండటంతో విద్యార్థులను ఆ దిశగా సిద్ధం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం కల్పించేలా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ప్రణాళికలను సైతం రూపొందించింది. దీంతో ఈ సంవత్సరం నుంచే విద్యా బోధన కొత్త పుంతలు తొక్కనుంది. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ బోర్డు సదుపాయం ఉన్న పాఠశాలలకు ఇప్పటి వరకు ఈ వెసులుబాటు లేకపోవడం వల్ల కొన్నిచోట్ల ఉపాధ్యాయులు తమ సెల్‌ఫోన్ ఇంటర్‌నెట్ ద్వారా కంప్యూటర్ విద్యను బోధిస్తున్నారు. అయితే ఇంటర్‌నెట్ వేగం సరిపోకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అంతే కాకుండా పాఠశాలల్లో ఉపాధ్యాయులు సెల్‌ఫోన్ వినియోగించవద్దన్న నిబంధనలను సైతం విధించడంతో కంప్యూటర్ విద్యకు మరింత ఆటంకంగా మారనున్నాయి. ఈ నేథప్యంలో బీఎస్‌ఎన్‌ఎల్ ద్వారా బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీతోపాటు ఇతర అంశాల్లో అధిక ప్రాధాన్యత ఉండనుండటంతో ప్రైవేటు విద్యాసంస్థలకు ధీటుగా పాఠశాలలను తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మొదటి విడతలో..
జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, కేజీవీబీలు, మోడల్ స్కూళ్లు కలిపి 841 ఉండగా.. వీటిలో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించనున్నారు. ఉన్నత పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ బోర్డు ద్వారా విద్యార్థులకు డిజిట్ పాఠాలు బోధించాలంటే ఇంటర్‌నెట్ తప్పనిసరి. అయితే మొదటి విడతలో 199 ఉన్నత పాఠశాలలకు మాత్రం ఈ ఏడాది నుంచి ఈ సేవలు ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేసి పంపగా.. త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తర్వాత విడతల వారిగా మిగతా పాఠశాలలకు సైతం ఈ సేవలను విస్తరించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ సదుపాయాలతో విద్యార్థులకు సంబంధించిన డిజిటల్ బోధన మెరుగుపడనుంది. రానున్న పోటీ ప్రపంచంలో ప్రైవేటు విద్యార్థులతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీ పడాలంటే ఈ సౌకర్యాలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
ఈ ఏడాది 199 స్కూళ్లలో
ఏర్పాటుకు నిర్ణయం
విడతల వారిగా అన్ని బడుల్లో
అమలుకు చర్యలు
జిల్లాలో డిజిటల్ బోధనకు
లభించనున్న ఊతం
చాలా ఉపయోగం..
ప్రభుత్వ పాఠశాలల్లో బ్రాడ్ బ్యాండ్ సేవలను ప్రారంభించడం వల్ల విద్యార్థులకు డిజిటల్ బోధనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మొదటి విడతలో 199 పాఠశాలల్లో ఈ సేవలను ప్రారంభించనున్నారు. విడతల వారిగా మిగతా పాఠశాలలకు కూడా ఈ సేవలు అందనున్నాయి.
– రమేష్‌కుమార్, డీఈఓ