
మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట
నాగర్‌కర్నూల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన మహాలక్ష్మి విజయవంతం సదస్సుకు డీఎం యాదయ్య అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు, విద్యార్థులు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారో వివరించారు. పలు పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో ప్రతిభచాటిన వారికి ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు బాధ్యతలు చేపట్టిన వెంటనే మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించారన్నారు. 200 కోట్ల మంది ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నారని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సంస్థకు రూ.6,680 కోట్లు చెల్లించిందని వివరించారు. వంటింటికే పరిమితమైన మహిళలు ఈ పథకం ద్వారా ఇతర ప్రాంతాలకు వెళ్లి చిరు వ్యాపారం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. మహిళలను కోటీశ్వరులు చేసేందుకు పెట్రోల్ బంకుల నిర్వహణతోపాటు బస్సులను కొనుగోలు చేసేందుకు రుణాలు సైతం మంజూరు చేస్తుందన్నారు. ఈ పథకం ద్వారా ఆర్టీసీ బలోపేతం కావడంతోపాటు మహిళలు కూడా ఆర్థికంగా ప్రయోజకులుగా మారుతున్నారని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తిమ్మాజిపేట, నాగర్‌కర్నూల్ పట్టణం, మండలం, తెలకపల్లి మండలాలకు చెందిన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.