
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదం
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలో చోరీలు, ఇతర నేరాల నివారించేందుకు ఎంతగానో ఉపయోగపడే సీసీ కెమెరాలను ప్రతిఒక్కరు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయ సమావేశ మందిరంలో కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, పెంట్లవెల్లి మండలాలకు సంబంధించిన బంగారు, ఫైనాన్స్ వ్యాపారులు, బ్యాంకు మేనేజర్లకు సీసీ కెమెరాల వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో రోజురోజుకూ చోరీలు పెరిగిపోతున్నాయని, ప్రతిఒక్క షాపు, ఫైనాన్స్ ఆఫీసులు, బ్యాంకులకు 360 డిగ్రీలు కవర్ అయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సీసీ కెమెరాలు ఎన్వీఆర్‌తోపాటు క్లౌడ్‌లోనూ రికార్డు అయ్యే విధంగా చూసుకోవాలని, సీసీ కెమెరాలకు అలారం వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి నేరాలనైనా ఆపగలిగే శక్తి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేటప్పుడు ముందు భాగంలో ఉన్న రోడ్డుకు ఇరువైపులా కవరయ్యే విధంగా రెండు కెమెరాలు ఏర్పాటు చేయాలని, తద్వారా ఎక్కడైనా చోరీలు జరిగినప్పుడు నేర పరిశోధనకు పోలీసులకు సహకరించాలని కోరారు. జిల్లాలో చోరీలను నియంత్రించేందుకు ఒక డీఎస్పీ, ముగ్గురు ఎస్‌ఐలతో ప్రతిరోజు నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని, ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటామని వివరించారు. సమావేశంలో ఏఎస్పీ రామేశ్వర్, డీఎస్పీ శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్