
ఉన్నత విద్య మిథ్య..!
అచ్చంపేట: జీవితంలో త్వరగా స్థిరపడాలనుకునే వారికి సాంకేతిక విద్య చక్కని దిక్సూచి. కానీ నాగర్‌కర్నూల్ జిల్లాలో కల్వకుర్తి, మన్ననూర్ ఐటీఐ కళాశాల మినహా మరెక్కడా ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ, పాలిటెక్నిక్, మహిళా డిగ్రీ కళాశాలలు లేకపోవడంతో విద్యారంగంలో వెనుకబడిన తీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇండస్ట్రీయల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఐటీఐ), పాలిటెక్నిక్, నర్సింగ్ కోర్సుల ద్వారా విద్యార్థులు తక్కువ సమయంలోనే ఉద్యోగావకాశాలు పాందే అవకాశం ఉంది. కానీ కోర్సులను చదవాలంటే దూరప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కలగానే..
నల్లమల ప్రాంతంలో పీజీ, సాంకేతిక విద్యను అందుబాటులోకి తెస్తామన్న ప్రజాప్రతినిధుల హామీలు బుట్టదాఖలయ్యాయి. మాజీ మంత్రి మహేంద్రనాథ్ హయాంలో విద్యపరంగా నల్లమలకు కొంత మేలు జరిగింది. అచ్చంపేటలో మహిళా డిగ్రీ కళాశాల, పీజీ కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పిన నాయకుల మాటలు నీటి మూటలు మిగిలిపోతున్నాయి. బల్మూర్ మండలం కొండనాగులలో ఉమామహేశ్వరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అమ్రాబాద్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. అచ్చంపేట పట్టణంలో ప్రగతి, చైతన్య, త్రివేణి ప్రైవేటు డిగ్రీ కళాశాలలున్నా ఆర్థిక ఇబ్బందుల కారణంగా పేద విద్యార్థులు అందులో చదవలేకపోతున్నారు. అచ్చంపేటకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండనాగుల, 23 కిలో మీటర్ల దూరంలో అమ్రాబాద్‌కు ఉప్పునుంతల, అచ్చంపేట, లింగాల మండలాల విద్యార్థులు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొని కొండనాగుల, అమ్రాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివినా.. విద్యార్థులు పీజీకి సుదూర ప్రాంతాలకు వెళ్లలేక ఉన్నత విద్యకు దూరమవుతున్నారు.
మిహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటుకు..
అచ్చంపేటలో ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాలలు, గురుకుల జూనియర్ కళాశాలతో పాటు మూడు ప్రైవేటు జూనియర్ కళాశాలు ఉన్నాయి. కొండనాగుల, అమ్రాబాద్, వంగూర్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, లింగాల, మన్ననూర్‌లో గురుకుల జూనియర్ కళాశాలల్లో ఎంతమంది విద్యార్థులు ప్రతియేటా ఇంటర్ పూర్తి చేస్తున్నారు. అచ్చంపేటలో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఎంతో కాలంగా డిమాండ్ ఉన్నా అది నెరవేరడం లేదు. 2005లో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని నాటి, నేటి ఎమ్మెల్యే వంశీకృష్ణ స్పష్టం చేసినా నేటికీ కార్యరూపం దాల్చలేదు.
విద్యారంగం అభివృద్ధి చెందాలి
విద్యారంగంలో అత్యంత వెనుకబడిన జిల్లాను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం జిల్లాలో ఐటీఐ, పాలిటెక్నిక్, నర్సింగ్ కళాశాలలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను ప్రారంభించాలి. జిల్లాలో సాంకేతిక కళాశాలల ఏర్పాటు కోసం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పలుమార్లు అందోళనలు చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కళాశాల సాధనకు విద్యార్థి సంఘాలు అన్ని ఏకమై దశల వారీగా ఉద్యమాలు చేపడుతాం.
– ఎడ్ల మారుతి,
డీవీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు
సాంకేతిక విద్య అందించాలి
అచ్చంపేట నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అధికంగా ఉన్నారు. వెనకబడిన అచ్చంపేటలో ఐటీఐ, పాలిటెక్నిక్, పీజీ, నర్సింగ్‌కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి. సాంకేతిక విద్య అందక విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందట్లేదు. ప్రభుత్వం గుర్తించి ఇక్కడ కళాశాలలు ఏర్పాటు చేయాలి.
– సయ్యద్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు
విద్యాభివృద్ధికి కృషి
నల్లమల ప్రాంత విద్యార్థులకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తీసుకొచ్చి నాణ్యమైన విద్య అందిస్తాం. మహిళా డిగ్రీ కళాశాల, పీజీ, పాలిటెక్నిక్, నర్సింగ్ కళాశాలలు, ఆయుర్వేద కళాశాలను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరాం. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఏజెన్సీ ప్రాంతామైన అచ్చంపేటను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతాం.
– డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ,
ఎమ్మెల్యే, అచ్చంపేట
జిల్లా విద్యార్థులకు ఆటంకం
జిల్లాలో 2024–25 విద్యా సంవత్సరానికి గాను 10,196 మంది విద్యార్థులు పదో తరగతి ఉత్తీర్ణత సాధించారు. వారందరికీ సాంకేతిక కోర్సుల్లో చేరడానికి అర్హత ఉంటుంది. వీరితో పాటు ఇంటర్ చదివిన విద్యార్థులు సైతం ఈ కోర్సుల్లో చేరొచ్చు. ఉమ్మడి జిల్లాలో వనపర్తి, మహబుబ్‌నగర్, గద్వాల వంటి ప్రాంతాల్లో పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలు ఉన్నప్పటికీ దూరభారంతో పాటు సీట్లు కూడా సరిపోక నాగర్‌కర్నూల్ జిల్లా విద్యార్థులకు అనుకున్న స్థాయిలో అవకాశాలు దక్కడం లేదు.
జిల్లాలో కానరాని పాలిటెక్నిక్, పీజీ, మహిళా డిగ్రీ కళాశాలలు
లక్ష్యానికి దూరమవుతున్న
విద్యార్థులు
నెరవేరని ప్రజాప్రతినిధుల హామీలు
విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని పలువురి డిమాండ్

ఉన్నత విద్య మిథ్య..!

ఉన్నత విద్య మిథ్య..!

ఉన్నత విద్య మిథ్య..!