
మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి
నాగర్‌కర్నూల్ క్రైం: మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని, అప్పుడే ఉన్నత స్థానాలు అధిరోహిస్తారని అదనపు ఎస్పీ రామేశ్వర్ అన్నారు. , మహిళలతో అనుచితంగా ప్రవర్తించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురువారం ఎస్పీ కార్యాలయ సమావేశ మందిరంలో నర్సింగ్ కళాశాల విద్యార్థినులకు షీ టీం, సఖీ సేవలపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు ఎస్పీ మాట్లాడుతూ మహిళలు ఉన్నత లక్ష్యాలను నిర్ధేశించుకుంటూ.. అన్ని రంగాల్లో సత్తా చాటాలని సూచించారు. మహిళలు పనిచేసే ప్రదేశాల్లో లైగింక వేధింపులు, ఉమెన్ ట్రాఫికింగ్, ఈవ్ టీజింగ్‌లపై నిరంతరం నిఘా ఉంచుతున్నామని తెలిపారు. ఎవరైనా మహిళలను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, దాడికి పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు.
సమయాన్ని వృథా చేయొద్దు
సామాజిక మాధ్యమాల ద్వారా విద్యార్థులు ఎక్కువగా తమ సమయాన్ని వృథా చేసుకోవడమే కాకుండా అపరిచిత వ్యక్తుల ద్వారా మోసపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులు ఆలస్యం చేయకుండా డయల్ 100, 87126 57676 నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలపాలని కోరారు. సఖీ సెంటర్ అడ్మిన్ సునీత మాట్లాడుతూ మహిళలు ఎవరైనా గృహహింస, శారీరకంగా, మానసికంగా ఏమైనా హింసకు లోనైతే జిల్లా కేంద్రంలోని సఖీ సెంటర్‌ను సంప్రదిస్తే వారికి కావాల్సిన కౌన్సిలింగ్, న్యాయపరమైన, పోలీసు సహాయం అందిస్తామన్నారు. నిస్సాహయ స్థితిలో ఉంటే హెల్ప్ లైన్ నంబర్ 181, 99519 40181 ఫోన్ చేసి ఫిర్యాదు చేసి సిబ్బంది స్పందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో సీఐ శంకర్, జిల్లా షీ టీం ఇన్‌చార్జి ఏఎస్‌ఐ విజయలక్ష్మి, షీ టీం సభ్యుడు వెంకటయ్య పాల్గొన్నారు.
అదనపు ఎస్పీ రామేశ్వర్