
‘అంకితభావంతో పనిచేస్తేనే గౌరవం’
కల్వకుర్తి టౌన్: పోలీసులు అంకితభావంతో పనిచేసినప్పుడే ప్రజల్లో గౌరవం పెరుగుతుందని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. గురువారం ప ట్టణంలోని పోలీస్‌స్టేషన్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ముందు గా రిసెప్షన్, ఫిర్యాదుదా రుల రిజిస్టర్, లాకప్ రూంను పరిశీలించారు. అందుకు సంబంధించిన రిజిస్టర్, వాచ్ డ్యూటీలో ఉన్న సిబ్బందితో వివరాలను ఆరా తీసి, వారికి పలు సూచనలు చేశారు. డ్యూటీలో ఉన్న సమయంలో ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది తప్పనిసరిగా డ్రెస్ కోడ్‌ను పాటించాలని ఆదేశించారు. ఎస్పీ వచ్చిన సమయంలో పలువురు సిబ్బంది డ్రెస్ కోడ్‌తో పాటుగా, నేమ్ బ్యాడ్జీలను ధరించకపోవటంతో మరోమారు ఇలాంటి తప్పులను చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అనంతరం ఎస్‌ఐ చాంబర్‌లో పలు కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించిన ఆయన, ఇటీవల పట్టణంలోని జరిగిన వరుస దొంగతనాలపై విచారణ జరిగే తీరును డీఎస్పీ వెంకట్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. రాత్రి సమయంలో పెట్రోలింగ్ పెంచాలని, ప్రజల భద్రతను పరిరక్షించాలన్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్ పరిసరాలను గమనించి, వానాకాలం కావటంతో ఆవరణలో పిచ్చిమొక్కలు పెరగకుండా పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. ఎస్పీ వెంట కల్వకుర్తి సీఐ నాగార్జున, పోలీస్ సిబ్బంది ఉన్నారు.