
సివిల్ సప్లయ్ గోదాంలో అధికారుల తనిఖీలు
అచ్చంపేట రూరల్: పట్టణంలోని సివిల్ సప్లై గోదాంలో విజిలెన్స్ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ వెంకటేశం ఆధ్వర్యంలో పలువురు అధికారులు గోదాంలోని స్టాక్, రిజిస్టర్లను పరిశీలించారు. స్టాక్‌లో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు రేషన్‌డీలర్లు, వసతిగృహ ఇన్‌చార్జీలు, ఐసీడీఎస్ అధికారులకు ఫోన్లు చేసి స్టాక్ తీసుకున్నారా? లేదా..? అనే విషయంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. వర్షాకాలం సంభవించే ప్రకృతి విపత్తులను దృష్టిలో ఉంచుకొని వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు మూడు నెలల రేషన్ బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిందని తెలిపారు. ఇందులో భాగంగా రేషన్ బియ్యం పంపిణీపై ప్రభుత్వం నిఘాను ఏర్పాటు చేసి, రాష్ట్ర, జిల్లా అధికారులను సమాయత్తం చేసిందని పేర్కొన్నారు. ఇప్పటికే మూడు నెలలకు సంబంధించి అన్ని రేషన్ షాపుల నుంచి లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ పండరి, ఎస్‌ఐ సాంబశివరావు, గోదాం ఇన్‌చార్జీ మోతిలాల్ పాల్గొన్నారు.