
‘స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం’
కల్వకుర్తి రూరల్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతి కార్యకర్త ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు తల్లోజు ఆచారి కోరారు. గురువారం పట్టణంలో మండల పార్టీ అధ్యక్షుడు నరేష్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ఎన్నికల కార్యశాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించడంతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రతిరోజు ప్రజలకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యు లు మొగిలి దుర్గాప్రసాద్, బండేల రామచంద్రారెడ్డి, నర్సిరెడ్డి, కిష్టారెడ్డి, శ్యామ్, సురేందర్ గౌడ్, శ్రీశైలం, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.