
అప్పుడే.. లోకల్ ఫైట్!
స్థానిక ఎన్నికల వేళ వేడెక్కిన రాజకీయం
● ముఖ్య నేతల మధ్య
పేలుతున్న మాటల
తూటాలు
● షెడ్యూల్ విడుదలకు ముందుగానే చేరికలకు తెరలేపిన పార్టీలు
● గెలుపే లక్ష్యంగా ప్రధాన
రాజకీయ పక్షాల కసరత్తు
● సంక్షేమం, అభివృద్ధి
కార్యక్రమాలతో ‘హస్తం’
ముందడుగు
● ప్రభుత్వ వైఫల్యాలను
ఎండగట్టేలా
‘కారు’ కార్యాచరణ
● పట్టు సాధించాలనే తపనతో ‘కమలం’
జడ్చర్లలో 100 పడకల ఆస్పత్రి వద్ద మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కుటుంబసభ్యులు అక్రమంగా తీసుకున్న అసైన్డ్ ల్యాండ్‌ను ప్రభుత్వానికి అప్పగించాలి. సిగ్నల్‌గడ్డ రోడ్డు విస్తరణకు సంబంధించి పాత బస్టాండ్ వైపు నేరుగా వాహనాలు వెళ్లేందుకు మార్గం లేదు. డిజైన్ లోపంతో ఇబ్బందులు వస్తాయి.
– జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి
ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సొంత ఊరు రంగారెడ్డిగూడ దేవాలయం భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలి. సిగ్నల్‌గడ్డ రోడ్డు విస్తరణ పనుల డిజైన్‌లో ఎలాంటి లోపాలు లేవు. పోలేపల్లి సెజ్ నుంచి నా ఖాతాకు డబ్బులు వచ్చాయని ఆరోపణలను రుజువు చేయాలి. లేకపోతే క్షమాపణలు చెప్పాలి.
– లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు.. ఆ తర్వాత మున్సిపల్, కార్పొరేషన్, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేలా ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఉమ్మడి పాలమూరులోని ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ తగిన కసరత్తు ప్రారంభించాయి. గెలుపే లక్ష్యంగా రూపొందించుకున్న ప్రణాళికకు అనుగుణంగా ఆయా పార్టీల ముఖ్యనేతలు పావులు కదుపుతున్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో అధికార పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో ప్రచారం ప్రారంభించగా.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలలను ఎండగట్టే కార్యాచరణతో ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు ముందుకుసాగుతున్నారు. మరో రెండు రోజులు లేదంటే ఈ నెలాఖరులోపు ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందనే అంచనాతో పార్టీల్లో చేరికలు ఊపందుకోగా.. స్థానికంగా సందడి నెలకొంది.
చేరికల పరంపర
స్థానిక ఎన్నికల వేళ ఉమ్మడి పాలమూరులోని పలు నియోజకవర్గాల పరిధిలో వివిధ పార్టీల్లో చేరికలు ఊపందుకున్నాయి. ఇటీవల నాగర్‌కర్నూల్, గద్వాల, వనపర్తి జిల్లాల్లో కాంగ్రెస్ నుంచి పలువురు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ నెల 18న బీఆర్‌ఎస్‌కు చెందిన జడ్చర్ల తాజా మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కోనేటి పుష్పలత సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవల నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం నర్వ మండలానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీలో చేరారు. తాజాగా మహబూబ్‌నగర్ చెందిన రైతుబంధు జిల్లా సమితి మాజీ చైర్మన్ గోపాల్‌యాదవ్, మాజీ కౌన్సిలర్ పద్మజ బీఆర్‌ఎస్‌కు రా జీనామా చేశారు. వా రు కాంగ్రెస్‌లో చేరే అవ కాశం ఉన్నట్లు ప్రచా రం జరుగుతోంది.
బీజేపీ సైతం..
స్థానిక ఎన్నికల్లో ఈ సారి పట్టు సాధించాలనే లక్ష్యంతో బీజేపీ ముందుకు సాగుతోంది. మహబూనగర్ ఎంపీ డీకే అరుణ పార్లమెంట్ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో క్రమం తప్పకుండా పర్యటిస్తున్నారు. షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, మక్తల్, నారాయణపేట, దేవరకద్ర నియోజకవర్గ పరిధిలో పలు మండలాల్లో సమావేశాలు నిర్వహిస్తూ.. కేడర్‌లో జోష్ నింపుతున్నారు.
ఇటు కాంగ్రెస్.. అటు బీఆర్‌ఎస్
స్థానిక సంస్థల ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ మేరకు ఆయా నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ కేడర్‌లో జోష్ నింపుతున్నారు. ప్రధానంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ గెలుపు గుర్రాల వడబోత చేపట్టినట్లు తెలుస్తోంది. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మార్నింగ్‌వాక్ పేరిట వార్డుల్లో పర్యటిస్తుండగా.. ఆయన ముఖ్య అనుచరులు మండలాల వారీ సమావేశాలు నిర్వహిస్తూ కేడర్‌లో జోష్ నింపుతున్నారు. నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నేతలు, ప్రధాన అనుచరులు మండలాలు, పట్టణాల వారీగా నిత్యం పర్యటిస్తూ.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు వివరిస్తూ.. ప్రజలకు తెలియజేసేలా ప్రచారం చేపట్టాలని శ్రేణులకు సూచిస్తున్నారు. బీఆర్‌ఎస్ నేతలు సైతం పోటాపోటీగా నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ.. ప్రచారం మొదలుపెట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రజల్లోకి వెళ్లేలా గ్రామ, మండలస్థాయి కీలక నాయకులను సమాయత్తం చేస్తున్నారు. కాగా, జోగుళాంబ గద్వాల జిల్లాకు సంబంధించి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ప్రధానంగా గద్వాల నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌లో అంతర్గత పోరు కొనసాగుతుండడంతో ఆయా పార్టీల శ్రేణుల్లో గందరగోళం నెలకొంది.
దేవరకద్ర, జడ్చర్లలో మాటల తూటాలు
దేవరకద్ర నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ఆ తర్వాత ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మధ్య విమర్శల పర్వం నామమాత్రంగా కొనసాగింది. నిన్న, మొన్నటి వరకు రాజకీయ వాతావరణం స్తబ్దుగా ఉండగా.. స్థానిక ఎన్నికలు వస్తాయనే క్రమంలో ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేల మధ్య మాటల తూటాలు మంటలు రేపాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో పాటు వ్యక్తిగత విమర్శలతో ప్రస్తు తం రాజకీయ సెగ రాజుకుంది. జడ్చర్ల నియోజకవర్గంలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మధ్య నిత్యం మాటల తూటాలు పేలుతుండగా.. రాజకీయం రసవత్తరంగా మారింది.

అప్పుడే.. లోకల్ ఫైట్!

అప్పుడే.. లోకల్ ఫైట్!

అప్పుడే.. లోకల్ ఫైట్!