
జిల్లాలో యూరియా కొరత లేదు..
తాడూరు: జిల్లాలో యూరియా కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. బుధవారం తాడూరులోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదామును కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి.. యూరియా నిల్వలను పరిశీలించారు. వానాకాలంలో సాగుకు సంబంధించి ఇప్పటి వరకు 657 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు పంపిణీ చేశామని.. గోదాములో 37 మెట్రిక్ టన్నుల స్టాక్ ఉందని సింగిల్‌విండ్ చైర్మన్ రాంచంద్రారెడ్డి, సిబ్బంది కలెక్టర్‌కు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదన్నారు. రైతుల అవసరానికి అనుగుణంగా 3,600 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లావ్యాప్తంగా 23 పీఏఎస్‌సీలు, 230 ప్రైవేటు క్రిమిసంహారక మందులు, ఎరువుల విక్రయ కేంద్రాలు ఉన్నాయని.. వాటిలో తప్పనిసరిగా స్టాక్ బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు తమ వ్యవసాయ అవసరాల మేరకు మాత్రమే యూరియాను కొనుగోలు చేయాలని.. ముందుగానే ఎక్కువగా కొనుగోలుచేసి ఇళ్లల్లో నిల్వ చేసుకోవద్దని సూచించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. పీహెచ్‌సీలో మందుల స్టాక్‌ను పరిశీలించడంతో పాటు వైద్యసేవలపై ఆరా తీశారు. వైద్యసిబ్బంది సమయపాలన పాటించి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అదే విధంగా తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా భూ భారతి దరఖాస్తుల వివరాలను తెలుసుకున్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన 785 దరఖాస్తులకు నోటీసులు జారీ చేశామని.. 55 దరఖాస్తులను ఆమోదించినట్లు తహసీల్దార్ జయంతి తెలిపారు. అనంతరం యాదిరెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట డీఏఓ యశ్వంత్‌రావు, ఏడీ పూర్ణచందర్‌రెడ్డి, ఎంపీడీఓ ఆంజనేయులు, ఏఓ సందీప్‌కుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
క్రిటికల్ కేర్ సెంటర్ పనులు
త్వరగా పూర్తిచేయాలి
నాగర్‌కర్నూల్ క్రైం: ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆవరణలో రూ. 23.75 కోట్లతో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ సెంటర్ పనులను త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం క్రిటికల్ కేర్ సెంటర్ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో చికిత్సలు అందించేందుకు గాను 50 పడకలతో క్రిటికల్ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.ఉషారాణి, డా.రోహిత్ ఉన్నారు.
అందుబాటులో 3,600 మెట్రిక్ టన్నులు
ఎరువుల దుకాణాల్లో స్టాక్ బోర్డులు
ఏర్పాటుచేయాలి
కలెక్టర్ బదావత్ సంతోష్