
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి సాధించాలి
నాగర్‌కర్నూల్: జిల్లాలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో స్పష్టమైన పురోగతి కనిపించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దేవ సహాయం అన్నారు. బుధవారం సమీకృత కలెక్టరేట్‌లో ఇందిరమ్మ ఇళ్ల పథకం, వనమహోత్సవం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, సీజనల్ వ్యాధులు తదితర అంశాలపై మండల అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా సాధించిన ప్రగతి వివరాలను తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల విషయంలో అలసత్వం ప్రదర్శిస్తున్న ఎంపీడీఓలపై అదనపు కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంపీడీఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి.. ప్రతి ఇంటి నిర్మాణ పనుల వివరాలను పక్కాగా సేకరించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ.. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని గ్రామపంచాయతీల్లోని లబ్ధిదారుల వివరాలను రెండు రోజుల్లోగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా ఇళ్ల నిర్మాణాలకు సుముఖంగా లేని లబ్ధిదారుల నుంచి లిఖిత పూర్వకంగా లేఖలు తీసుకోవాలని.. వారి స్థానంలో అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని సూచించారు. ప్రభుత్వం జారీ చేసిన కొత్త మార్గదర్శకాల మేరకు అర్హులైన వారికి 15 రోజుల్లోగా డబుల్‌బెడ్రూం ఇళ్లను కేటాయించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. వన మహోత్సవంలో నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలు నాటాలన్నారు. అదే విధంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజలు విష జ్వరాల బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో వైద్యులు అందుబాటులో ఉంటూ.. మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. సమావేశంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ గోపాల్ నాయక్, డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి, హౌసింగ్ పీడీ సంగప్ప, డీపీఓ శ్రీరాములు, మిషన్ భగీరథ ఈఈలు విజయశ్రీ,, సుధాకర్‌సింగ్ తదితరులు ఉన్నారు.