
ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ
బిజినేపల్లి: ఆన్‌లైన్ మోసాలపై అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ గైక్వాండ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. బుధవారం బిజినేపల్లి గురుకుల పాఠశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గతంలో హత్యలు, చోరీలు వంటి సాధారణ నేరాలు అత్యల్పంగా ఉండగా, ప్రస్తుతం డిజిటల్ నేరాల సంఖ్య పెరిగిందన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ సెల్‌ఫోన్ అధికంగా వినియోగించడమే కారణమని అన్నారు. సెల్‌ఫోన్ సత్ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలని.. లేకపోతే అవే ఫోన్లు ఊరికొయ్యలుగా మారుతాయన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రమశిక్షణతో చదువుకోవాలన్నారు. ప్రతి విద్యార్థికి డిజిటల్ నేరాలపై అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. నేరాలకు పాల్పడే వారికి కచ్చితంగా శిక్ష పడుతుందన్నారు. అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం సీసీ కెమెరాల పనితీరును స్వయంగా పరిశీలించారు. ఎస్పీ వెంట ఎస్‌ఐ శ్రీనివాసులు ఉన్నారు.