
స్థానికం.. సన్నద్ధం
వివరాలు 8లో u
అచ్చంపేట: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను ప్రభుత్వం ఖరారు చేయడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వివరాలను విడుదల చేయడంతో ఎన్నికల ప్రక్రియకు ప్రభుత్వ యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. దీంతో ఎప్పుడైనా ఎన్నికల నగారా మోగుతుందని స్పష్టమైన సంకేతాలిచ్చింది. ఎన్నికలకు అవసరమైన సామగ్రి సమకూర్చుకోవాలని పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏ ఎన్నికలు వచ్చినా నిర్వహించేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు.
అందుబాటులో బ్యాలెట్ బాక్సులు
2024 జనవరి 31న సర్పంచ్, అదే ఏడాది జూలై 4న ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం ముగిసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పల్లెల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల బ్యాలెట్ పేపరు విధానంలో జరగనున్నాయి. ఇప్పటికే ఓటరు జాబితా, బ్యాలెట్ బాక్సులను జిల్లాలో అందుబాటులో ఉంచారు. సర్పంచ్, వార్డు సభ్యులకు అవసరమైన బ్యాలెట్ పేపర్స్ ముద్రించారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, వసతుల కల్పన చేపట్టారు. స్టేషనరీ, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సామగ్రి రాష్ట్రస్థాయిలో కొనుగోలు చేసి జిల్లాలకు ఇప్పటికే తరలించారు. అలాగే ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది కేటాయింపు పూర్తి చేసి వారి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. మరోవైపు వర్షాకాలం కావడంతో ప్రత్యేక ఏర్పాట్లు అవసరమవుతాయని అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఒకట్రెండు రోజుల్లో కలెక్టర్లు, ఎస్పీలు, డీపీఓ, జిల్లా పరిషత్ సీఈఓలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
పార్టీ గుర్తులపైనే..
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరగనున్నాయి. జెడ్పీటీసీలు అందరూ కలిసి జెడ్పీచైర్మన్‌ను.. ఎంపీటీసీలు ఎంపీపీని ఎన్నుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జిల్లాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేయనుంది. మరోవైపు స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఆర్డినెన్స్ ఇప్పటికే గవర్నర్ వద్దకు పంపించారు. గవర్నర్ ఆమోదం తర్వాత రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. దీంతో జిల్లాలో 214 ఎంపీటీసీ స్థానాల్లో బీసీలకు 90 సీట్లు దక్కే అవకాశం ఉంది. అలాగే మొత్తం స్థానాల్లో మహిళలకు 50 శాతం రిజర్వ్ చేయనున్నారు. గత ఎన్నికల్లో బీసీలకు 27 శాతం, ఎస్సీలకు 15, ఎస్టీలకు 6 శాతం సీట్లు కేటాయించారు. మండలాన్ని యూనిట్‌గా తీసుకుని ఎంపీటీసీలు, సర్పంచ్ పదవులకు రిజర్వేషన్లు వర్తింపజేయనున్నారు. ముందుగా ప్రాదేశిక, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
జిల్లా పరిధిలో..
జిల్లాలో 20 జెడ్పీటీసీ.. 214 ఎంపీటీసీ స్థానాలకు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించనుంది. ఇప్పటికే ఎంపీటీసీల పునర్విభజన ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. అయితే గత ఎన్నికల్లో జిల్లాలో 212 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. కోడేరు మండలం ముత్తిరెడ్డిపల్లి, మాచినేనిపల్లి, సింగాయిపల్లి ఎంపీటీసీ స్థానాలు కొత్తగా ఏర్పడిన వనపర్తి జిల్లా ఏదుల మండలంలో కలపడంతో మూడు ఎంపీటీసీలు తగ్గాయి. ఇదే సమయంలో అచ్చంపేట మున్సిపాలిటీ నుంచి విలీనం రద్దయిన పలకపల్లి, పులిజాల, నడింపల్లి, లక్ష్మాపూర్, బల్మూర్ మండలం పొలిశెట్టిపల్లి ఎంపీటీసీ స్థానాలు 5 పెరగడంతో 214కు చేరింది.
పల్లెల్లో పంచాయతీ, పరిషత్ ఎన్నికల సందడి
సామగ్రి సిద్ధం చేస్తున్న అధికార యంత్రాంగం
ఇప్పటికే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ స్థానాల ఖరారు
ఇప్పటికే నిర్వహణపై మొదటి విడత శిక్షణ పూర్తి
బీసీ రిజర్వేషన్‌కు ఆమోదం రాగానే షెడ్యూల్ ప్రకటన

స్థానికం.. సన్నద్ధం