
‘మహాలక్ష్మి’ పథకంతో సాధికారత
నాగర్‌కర్నూల్: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం విజయవంతంగా అమలవుతుందని కలెక్టర్ బదావత్ సంతోష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత ప్రయా ణం ద్వారా మహిళా సాధికారత దిశగా అడుగులు పడుతున్నాయని, దూర ప్రాంత ప్రజలు కూడా నిత్యం నగరానికి వచ్చి ఉద్యోగాలు చేస్తూ వృద్ధి సాధించడం అభినందనీయమన్నారు. ప్రతి మహిళ నెలకు రూ.4–5 వేల వరకు ఉచిత ప్రయాణం ద్వారా ఆదా చేసుకుంటున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం పురస్కరించుకొని బుధవారం జిల్లాలోని కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట డిపోల్లో సంబరాలను ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులను ఆహ్వానించాలని చెప్పారు. మహిళా ప్రయాణికులను శాలువా, బహుమతితో సత్కరించాలని, పాఠశాల, కళాశాలల విద్యార్థులకు వ్యాసరచన, రంగోలి, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి.. బహుమతులు అందజేయాలన్నారు. అలాగే పథకం విజయవంతానికి దోహదపడిన ప్రతి డిపోలోని 5 మంది ఉత్తమ డ్రైవర్లు, 5 కండక్టర్లతోపాటు ట్రాఫిక్ గైడ్, భద్రతా సిబ్బందిని సత్కరించాలని సూచించారు.
తరగతి గదులు మార్చండి..
బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్ గ్రామ ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాల తరగతి గదులను గ్రామంలోని మరో పాఠశాలకు తక్షణమే మార్చాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం కలెక్టర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో అక్షరాలు, పదాలు చదివించారు. విద్యార్థులకు భద్రతపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలు, రోజువారి హాజరు శాతం పరిశీలించారు. ఉన్నత పాఠశాలను సందర్శించి పదో తరగతి విద్యార్థుల సామర్థ్యాలు పరీక్షించి గణిత బోధన చేశారు. కలెక్టరేట్ వెంట డీఈఓ రమేష్‌కుమార్, ఓపెన్ స్కూల్ డైరెక్టర్ శ్రీహరి, తహసీల్దార్ ఎండీ మునీరుద్దీన్, ఎంఈఓ రఘునందన్‌రావు తదితరులున్నారు.